న్యూఢిల్లీ: మురికివాడల్లో నివసించే ప్రజలకు పక్కాగృహాలు నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మొదటి మేనిఫెస్టోలో తక్కువ ధరకే విద్యుత్, నీటిని సరఫరా చేస్తానని హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ, తాజాగా పలు హామీలతో రెండోభాగాన్ని విడుదల చేసింది. కాంగ్రెస్ ఢిల్లీ అధ్యక్షుడు అరవింద్ సింగ్ లవ్లీ మంగళవారం దీనిని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 7న జరగనున్న ఎన్నికల్లో తమకు ఓటు వేసి గెలిపించినట్లయితే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు, మోనోరైలు, సిగ్నళ్లతో ఇబ్బంది లేని రోడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతే కాకుండా రాజధానిలో బిచ్చగాళ్లు లేకుండా చేస్తామన్నారు. ఉర్దూ, పంజాబీ భాషా టీచర్ల నియామకాలు చేపడతామని తెలిపారు.అయితే 2013 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇవే హామీలిచ్చింది. తాము నివసించే ప్రాంతంలోనే ఇళ్లు పొందే హక్కు పేదవాళ్లకు రాజ్యాంగం కల్పించిందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే వారి ఇళ్లను తొలగించబోమని పేర్కొన్నారు. గతంలో 40 వేల మంది వీధి వ్యాపారులకు స్థలాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు.