ఛట్ పూజకు సెలవుదినాన్ని ప్రకటించే అంశాన్ని సైతం బీజేపీ నాయకులు రాజకీయాలకు వాడుకుంటున్నారని కాంగ్రెస్ మంత్రులు ధ్వజమెత్తారు.
సాక్షి, న్యూఢిల్లీ: ఛట్ పూజకు సెలవుదినాన్ని ప్రకటించే అంశాన్ని సైతం బీజేపీ నాయకులు రాజకీయాలకు వాడుకుంటున్నారని కాంగ్రెస్ మంత్రులు ధ్వజమెత్తారు. చట్‌పూజకు ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నా ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీజేపీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ మంత్రులు అరవిందర్‌సింగ్,రాజ్‌కుమార్ చౌహాన్, హరుణ్ యూసుఫ్‌లు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి అంశాన్ని బీజేపీ నాయకులు రాజకీయాలకు వాడుకోవాలని చూడడం శోఛనీయమన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఛట్‌పూజను ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటిస్తామని చెబుతున్నారు. అది ఎలా సాధ్యమో వివరించాలన్నారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని మంత్రి అరవింద్‌సింగ్ లవ్లీ ఆరోపించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఛట్ పూజ నిర్వహించే 72 ఘాట్లను కాంగ్రెస్‌పార్టీ అభివృద్ధి చేసిందన్నారు. ఛట్‌పూజ ఏర్పాట్లలో రెవెన్యూ, ఢిల్లీ జల్ బోర్డు, ఢిల్లీ పోలీస్,ఆరోగ్య శాఖ, పీడబ్ల్యూడీ, డీయూఎస్‌ఐబీ,ఎంసీడీలు అన్ని విభాగాలు సమన్వయంతో ఏటా ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాయన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఛట్‌పూజ ఏర్పాట్లలో పాలుపంచుకుంటున్న సంస్థలను ప్రభుత్వం ఎలాంటి వివక్షకు గురిచేయడం లేదన్నారు. వారికి అవసరమైన పూర్తి సహకారం ఇస్తున్నామన్నారు. అనధికారిక కాలనీలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ లేవనెత్తిన అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయన్నారు. అనధికారిక కాలనీలను క్రమబద్దీకరించాలంటూ 2002లో కాంగ్రె స్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని హర్షవర్ధన్ వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఇలా చేయడంతో ప్రభుత్వంపై భారం పడుతుందని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారని పేర్కొన్నారు.
2007-08లో 1,639 కాలనీలు రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా, వాటిలో 1,218 కాలనీలను వెంటనే ప్రొవిజనల్ రెగ్యులరైజేషన్ ధ్రువపత్రాలు జారీ చే సినట్టు పేర్కొన్నారు. 2012 సెప్టెంబర్ 4న మరో 895 అనధికారిక కాలనీలను క్రమబద్దీకరించినట్టు తెలిపారు. 720 కాలనీల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 822 కాలనీలకు పూర్తి స్థాయిలో మంచినీటి సరఫరాతోపాటు డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎంసీడీల పరిధిలోని అనధికారిక కాలనీల్లో అభివృద్ధిపనులు చేపట్టడంలో బీజేపీ ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరించేవారని సింగ్ మండిపడ్డారు. వారిలో హర్షవర్ధన్ ఒకరని ఆయన పేర్కొన్నారు. రాజకీయ లబ్ధికోసమే హర్షవర్ధన్ ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.