
కాంగ్రెస్ పీసీసీలకు కొత్త ముఖాలు
- రాహుల్ ముద్రతో ఏఐసీసీలోకి యువనేతలు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడినప్పట్నుంచీ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో పార్టీ నాయకత్వాలను మార్చే దిశగా కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తోంది. దీంతో ఏఐసీసీలోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయని.. కొందరు యువనేతలను ప్రధాన కార్యదర్శులుగా నియమించే అవకాశముందని తెలుస్తోంది. పలు రాష్ట్రాల్లోనూ, ఏఐసీసీలోనూ యువనేతలకు ప్రాధాన్యమిస్తూ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముద్రతో జరగనున్న మార్పుచేర్పులను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు.
ఢిల్లీలో అరవింద్‌సింగ్ లవ్లీ స్థానంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మాకెన్, గుజరాత్‌లో మోధ్వాడియా స్థానంలో కేంద్ర మాజీమంత్రి భరత్‌సింగ్ సోలంకిలు పీసీసీ పగ్గాలు చేపట్టనున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కశ్మీర్, హరియాణాలకూ కొత్త పీసీసీ చీఫ్‌లు రానున్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ చేసిన ప్రచారం కాంగ్రెస్‌కు పీడకలలా గుర్తుండిపోతుందని ప్రముఖ జర్నలిస్టు వీర్ సంఘ్వి నిప్పులు చెరిగారు. రాహుల్ నాయకత్వంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో సింఘ్వి కాంగ్రెస్‌పై రాసిన ‘మాండేట్: విల్ ఆఫ్ ది పీపుల్’ పుస్తకం ప్రాధాన్యం సంతరించుకోనుంది. ఇది త్వరలో విడుదల కానుంది.