న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన తొలి జాబితాను విడుదల చేసింది. శుక్రవారం సాయంత్రం ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో 39 మంది పేర్లతో కూడిన జాబితాను ప్రకటించారు. ఈ 39 మందిలో రాహుల్ గాంధీ, శశిథరూర్‌లాంటి కీలక నేతలు ఉన్నారు.
తొలి జాబితాలో ఉన్న 39మందిలో 15మంది జనరల్.. 24 మంది ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మైనార్టీ కేటగిరీకి చెందినవారు ఉన్నట్లు వేణుగోపాల్ తెలిపారు. 12 మంది అభ్యర్థులు 50 ఏళ్లు లోపువారేనన్నారు. ఆ పార్టీ కీలక నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచే పోటీ చేయబోతున్నారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘేల్‌ను.. రాజ్‌నంద్‌గావ్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించబోతోంది కాంగ్రెస్. అలాగే కన్నడ హీరో శివరాజ్ కుమార్ భార్య గీతకు శివమొగ్గ టికెట్‌ను కేటాయించింది ఏఐసీసీ. కిందటి ఏడాదే ఆమె కాంగ్రెస్‌లో చేరారు.
ఈ నెల 11వ తేదీన మరోసారి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. మిగిలిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీపీపీ నేత సోనియాగాంధీ, కేసీ వేణుగోపాల్‌ల నేతృత్వంలో పార్టీ ‘కేంద్ర ఎన్నికల కమిటీ’ సమావేశమై తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, హర్యానా, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపుర్ రాష్ట్రాల్లోని అభ్యర్థులను ఖరారుచేసే అంశంపై కసరత్తు చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌మున్షీతోపాటు పార్టీ సీనియర్ నేతలు జైరాం రమేశ్, అధీర్‌రంజన్ చౌధరి, అంబికాసోని, ముకుల్‌వాస్నిక్, టీఎం సింగ్‌దేవ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ వర్చువల్‌గా హాజరయ్యారు.
తెలంగాణకు నాలుగు..
ఇక తెలంగాణలో నాలుగు స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి నల్లగొండ నుంచి కందూరు రఘువీర్‌రెడ్డి, జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్కార్, మహబూబ్‌నగర్ నుంచి చల్లా వంశీ చంద్ రెడ్డి, మహబూబాబాద్ బలరామ్ నాయక్ పేర్లు ఉన్నాయి. అంతకు ముందు కాంగ్రెస్ సీఈసీ నుంచి వచ్చిన జాబితాలో చేవెళ్ల అభ్యర్థిగా సునీతా మహేందర్‌రెడ్డి ఉన్నప్పటికీ.. తుది జాబితాలో ఆ స్థానం అభ్యర్థి పేరును ప్రకటించకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment