అమ్మ అంత్యక్రియలు కూడా వీడియో కాల్‌లో.. | Corona lockdown: Army jawan says Funeral to Mother on WhatsApp | Sakshi
Sakshi News home page

అమ్మ కోసం..!  

Published Wed, Apr 29 2020 9:16 AM | Last Updated on Wed, Apr 29 2020 11:19 AM

Corona lockdown: Army jawan says Funeral to Mother on WhatsApp - Sakshi

సాక్షి, చెన్నై : ‘అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.. అమ్మ గురించి ఎంత చేసినా స్వల్ప మే...అమ్మను ఎంత తలచినా మధురమే’ అయితే, ఈ ఆధునిక యుగంలో తల్లిని వృద్ధాశ్రమాల్లోకి నెట్టే తనయలు ఎందర్నో చూశాం. అలాగే, దేవుడితో సమానంగా పూజించే వారిని  చూశాం.’ ఆ దిశగా ఇక్కడ రెండో కోవకు చెందిన తనయులు లాక్‌డౌన్‌ వేళ అమ్మ కోసమే జీవితం అనిపించుకున్నారు. (నాన్నా.. అమ్మ ఏది?)

అనారోగ్యంతో ఉన్న తల్లికి వైద్య చికిత్స అందించడం కోసం ఓ తనయుడు గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌ నుంచి మోటార్‌ సైకిల్‌ పయనం చేశాడు. విరుదు నగర్‌ జిల్లా వైద్య్రా ఇరుప్పుకు చెందిన చంద్రమోహన్‌ అహ్మదాబాద్‌లో ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఉద్యోగ రీత్యా చంద్ర మోహన్‌ అక్కడే ఉన్నా, తల్లి కస్తూర్తి మాత్రం వైద్య్రా ఇరుప్పులో నివాసం ఉంటున్న ఆమె గత వారం  అనారోగ్యం బారిన పడ్డారు. ఆప్తులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించినా, తనయుడిని చూడాలన్న వేదనతో ఆ తల్లి పరితపించింది. (అయ్యో ! కరోనా ఎంత పని చేసింది)

సమాచారం అందుకున్న చంద్రమోహన్‌ తల్లి అనారోగ్యంతో ఉన్న విషయాన్ని అహ్మదాబాద్‌ కలెక్టరేట్‌ దృష్టికి తీసుకెళ్లి తమిళనాడుకు వెళ్లేందుకు అనుమతి పత్రం పొందాడు. రవాణా వ్యవస్థ లేని దృష్ట్యా, తన మోటారు సైకిల్‌లో 2,350 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాడు. మహారాష్ట్రలో.. కర్ణాటకలో వైద్య పరీక్షలు చేసుకుని సోమవారం తమిళనాడులోని స్వగ్రామానికి  చేరుకున్నాడు. తనయుడి చూసిన ఆనందంలో ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. చంద్ర మోహన్‌కు విరుదునగర్‌ పోలీసు యంత్రాంగం, వైద్యాధికారులు వైద్య పరీక్షలు నిర్వహించి 14 రోజుల పాటుగా ఇంట్లోనే ఉండాలని, ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచించారు. 

కడసారి చూపు కరువు..
సేలం జిల్లా మేచ్చేరి సమీపంలోని ఉక్కం పట్టికి చెందిన తంగవేలు, మాధు దంపతుల కుమారుడు శక్తి వేల్ ‌(42) భారత ఆర్మీలో జవానుగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం రాజస్థాన్‌లో విధుల్ని నిర్వరిస్తున్నాడు. శక్తి వేల్‌ తల్లి మాధు అనారోగ్యంతో  సోమవారం మరణించారు. ఈ సమాచారాన్ని కుటుంబీకులు రాజస్థాన్‌లో ఉన్న ఆర్మీ క్యాంప్‌కు అందజేశారు. రవాణా సౌకర్యం లేని దృష్ట్యా, కడసారిగా తల్లిని చూసుకుని, ఆమెకు అంత్యక్రియులు జరిపించలేని పరిస్థితి నెలకొంది. దీంతో కుటుంబీకులు  తల్లి పార్తీవదేహాన్ని వీడియో కాల్‌ ద్వారా శక్తివేల్‌కు చూపించారు. అంత్యక్రియులు కూడా వీడియో కాల్‌ ద్వారా చూసిన ఆ సైనికుడు కన్నీటిపర్యంతమయ్యాడు. తల్లి మృతదేహాన్ని వీడియో కాల్‌లో చూస్తూ అతడు బోరున విలపిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. (కరోనా: అంత్యక్రియలు అడ్డుకుంటే కటకటాలే!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement