‘జాతికి మోదీ క్షమాపణ చెప్పాలి’
అమరావతి: కరెన్సీ నోట్ల రద్దు నిర్ణయంతో ప్రధాని మోదీ ప్రజల్ని ముంచారని, ఇప్పటికైనా డ్రామాలు ఆపి జాతికి క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. నల్లధనాన్ని నియంత్రించే పేరుతో నోట్ల రద్దు నిర్ణయం పేద, మధ్య తరగతి వర్గాలకు పెనుశాపంగా మారిందని ఆవేదన వెలిబుచ్చారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాన్నీ అటకెక్కాయని, ఆర్థిక వ్యవస్థపై ఈ నిర్ణయం పెను ప్రభావాన్ని చూపుతోందని తెలిపారు. అనారోగ్యంతో ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేక రోగులు అవస్తలు పడుతున్నారని, నగదు విత్‌డ్రా కోసం బ్యాంకులకు వెళ్లిన వారిని డబ్బులేదని తిప్పి పంపుతున్నారని పేర్కొన్నారు.
మూడు నెలల క్రితమే ముందస్తు లీకులు ఇచ్చి బీజేపీ పెద్దలు, బడాబాబులు తమ నల్లధనాన్ని మార్చుకునే వెసులుబాటు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం సామాన్యులను మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం దారుణమని రామకష్ణ విమర్శించారు. ఇది చాలదన్నట్టు విజయ్‌మాల్యా వంటి నల్ల రాబందుల బకాయిలు రూ.7 వేల కోట్లకుపైగా రద్దు చేయడాన్ని చూస్తే బీజేపీ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో తేటతెల్లమవుతోందని ఎద్దేవా చేశారు.