ఉమ్మడి నిరసనలు!
కేంద్రంలో నడుస్తున్న నరేంద్ర మోదీ, రాష్ట్రంలోని పన్నీరు సెల్వం ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఉమ్మడి ఉద్యమానికి వామపక్షాలు శ్రీకారం చుట్టాయి. వళ్లువర్ కోట్టం వేదికగా సీపీఎం, సీపీఐ నేతలు నిరసనలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ప్రభుత్వాల తీరుపై కరపత్రాలు, ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేయనున్నారు.
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో వామపక్షాలు ఎవరికి వారే అన్న ట్లు గత కొంత కాలంగా వ్యవహరించారుు. దీంతో సీపీఎం, సీపీఐ కార్యక్రమాలు తగ్గుముఖం పట్టా యి. ప్రజల పక్షాన నిలబడి ఉద్యమించే వామపక్షాలు, ఉన్నట్టుండి తమ దారిలో తాము అన్నట్టుగా సాగడం చర్చనీయాంశంగా మారింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా సాగిన వీరు ఎట్టకేలకు ఒకే తాటిపైకి చేరారు. ఉమ్మడిగా ఉద్యమించి ప్రజల్లో నమ్మకాన్ని, తమ ఉనికిని చాటుకునేందుకు సీపీఎం, సీపీఐలు సిద్ధమయ్యాయి. కేంద్రంలోని నరేంద్ర మోదీ, రాష్ట్రం లోని పన్నీరు సెల్వం ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఉమ్మడి ఉద్యమాలకు నిర్ణయించాయి. తొలి విడతగా సోమవారం నుంచి ఈనెల 14 వరకు నిరసనలకు సిద్ధమయ్యారు. కేంద్రంలోని మోదీ సర్కారు వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల హామీలను గుర్తు చేస్తూ కరప్రతాలను సిద్ధం చేశారు.
విదేశాల్లోని బ్లాక్ మనీ రప్పించే నినాదంతో, ధరల తగ్గింపు డిమాండ్‌తో, ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్ విధానాల్ని ప్రజల నెత్తిన రుద్దేందుకు చేస్తున్న వ్యూహాల్ని, హిందుత్వాన్ని, మతతత్వాన్ని చాటుకునే విధంగా వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టడంతో పాటుగా రాష్ట్రంలోని పన్నీరు సెల్వం ప్రభుత్వం రూపంలో ప్రజలు ఎదుర్కొంటున్న అష్టకష్టాల్ని వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించారు. సోమవారం సాయంత్రం వళ్లువర్‌కోట్టం వేదికగా జరిగిన నిరసనలో తమ ఉమ్మడి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత టీ పాండియన్‌లు ఈ నిరసనలో పాల్గొని, కేంద్రం, రాష్ట్రంలోని ప్రభుత్వ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వాల తీరును ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈనెల 14 వరకు ప్రచార, నిరసనలు చేపట్టనున్నారు. అనంతరం దశల వారీగా తమ ఉద్యమాల్ని ఉధృతం చేయడానికి ముందుకు సాగుతున్నారు.