‘ఎఫ్‌ఐఆర్ నమోదు చట్టవ్యతిరేకం’
Published Mon, Dec 16 2013 11:24 PM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM
న్యూఢిల్లీ: నిర్భయ స్నేహితుడు ఇచ్చిన తప్పుడు వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారని, ఇది చట్టవ్యతిరేకమని డిసెంబర్ 16నాటి సామూహిక అత్యాచారం కేసులో ఉరిశిక్ష పడ్డ నలుగురిలో ఇద్దరు ఢిల్లీ హైకోర్టు ముందు వాదించారు. ఈ కేసు విచారణలో భాగంగా జస్టిస్ రేవ కేత్రపాల్, ప్రతిభా రాణిలతో కూడిన ధర్మాసనం ముందు దోషులు ముఖేశ్, పవన్ కుమార్ గుప్తాలు సోమవారం హాజరయ్యారు. వీరి తరఫు న్యాయవాది ఎం.ఎల్.శర్మ మాట్లాడుతూ నిర్భయ వాంగ్మూలం కాకుండా ఆమె స్నేహితుడు చెప్పిన దాన్ని బట్టి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం చట్ట వ్యతిరేకమన్నారు.
అలాగే మృతురాలి శరీరంపై ఉన్న ఆరు గాయాలతో, ఇద్దరు దోషుల వేలిముద్రలతో సరిపోయాయన్నారు. అలాంటప్పుడు ముఖేశ్, పవన్‌లను దోషులుగా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంగళవారం కూడా ఈ వాదనలు జరగనున్నాయి. కాగా, గతేడాది డిసెంబర్ 16న ఢిల్లీలో కదులుతున్న బస్సులో 23 ఏళ్ల వైద్య విద్యార్థినిపై ఆరుగురు అత్యాచారం చేశారు. వీరిలో నలుగురికి ఉరి శిక్ష ఖరారైంది. మరొకడు జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు మైనర్ బాల నేరస్తుల గృహంలో శిక్ష అనుభవిస్తున్నాడు.
Advertisement
Advertisement