
ప్రజా సేవకే అంకితం: అన్నాహజారే
గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన వీఎస్కేయూ
బళ్లారి : ప్రజా సమస్యలపై పోరాడే తమలాంటి వారికి ప్రభుత్వం, సంఘ సంస్థలు అందజేసే పట్టాలు, పురస్కారాలు మరింత బాధ్యత పెంచుతాయని ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే పేర్కొన్నారు. నగర శివార్లలోని విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(వీఎస్కేయూ) శనివారం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. మైసూరు పేటా తొడిగి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తన జీవితాన్ని ప్రజా సేవ కోసం అంకితం చేశానన్నారు. జనలోక్‌పాల్‌ను మరింత బలోపేతం చేయాలన్నారు. కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్త సంస్థలు చురుకుగా పని చేయాలన్నారు.
రాజ్యాంగమే మనకు ఇచ్చిన పోరాట హక్కును సమగ్రంగా వినియోగించుకోవాలన్నారు. ప్రజల మద్దతు ఉండే ఏ పోరాటాలైనా నీరుగారి పోవన్నారు. గతంలో తాను అవినీతికి వ్యతిరేకంగా ఇచ్చిన పోరాట పిలుపునకు యావత్ దేశ నలుమూలల నుంచి మద్దతు దొరికిందని గుర్తు చేశారు. సీనియర్ గాంధేయవాది దొరెస్వామి, ఇన్‌చార్జి వీసీ సోమశేఖర్, రిజిస్ట్రార్ విజయకుమార్, ఎల్‌ఆర్ నాయక్ పాల్గొన్నారు.