పన్నీరు శిబిరంలోకి దీప
సాక్షి, చెన్నై: పన్నీరు శిబిరంలోకి మంగళవారం రాత్రి దీపా చేరారు. అభిమానుల అభిష్టంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్నాడిఎంకే బలోపేతం లక్ష్యంగా శ్రమిస్తానని ప్రకటించారు. గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు సెల్వం ఇంటి వద్ద దీపాకు ఘన స్వాగతం పలికారు. ఈ ఇద్దరు ఒకే గూటికి చేరడంతో అన్నాడిఎంకేలో రాజకీయం వేడెక్కింది. అన్నాడీఎంకే చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా దీపా అడుగులు వేగవంతం అయ్యాయి. దీపాకు మద్దతుగా అన్నాడిఎంకేలోని ద్వితీయ , తృతీయ శ్రేణి కేడర్ కదిలింది. వారి అభిప్రాయాల మేరకు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం లక్ష్యంగా తీవ్రంగానే దీపా ప్రయత్నాల్లో పడ్డారు.
గత నెల 17వ తేదిన రాజకీయ పయానానికి శ్రీకారంచుట్టారు. కొత్త పార్టీ ప్రారంభించడమా? లేదా అన్నాడీఎంకేలో చేరడమా? అనే విషయంగా ఈనెల 24న మేనత్త జయలలిత పుట్టిన రోజున ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో దీపకు ఆహ్వానం పలుకుతూ పన్నీరు సెల్వం చేసిన ప్రకటన ఆమె శిబిరాన్ని ఆలోచనలో పడేసింది. శశికళకు వ్యతిరేకంగా పన్నీరు దూకుడు పెంచడంతో ఆయన శిబిరంలో చేరడం మంచిదన్న అభిప్రాయాన్ని అభిమానులు తెలియజేయడంతో ఆదిశగా దీపా అడుగులు పడ్డాయి. మంగళవారం ఉదయం నుంచి దీపా అభిమానులు, మద్దతు దారులతో సంప్రదింపుల్లో మునిగారు.
మెజారిటీ శాతం మంది పన్నీరు సెల్వంతో కలిసి పనిచేయాలని సూచించడంతో వారి అభిప్రాయానికి దీపా శిరస్సు వంచారు. ఇందుకు తగ్గట్టు రాత్రి తొమ్మిది గంటల సమయంలో మేనత్త జయలలిత సమాధి నివాళులర్పించారు. పన్నీరు శిబిరంలో చేరనున్నట్టు ప్రకటించారు. అన్నాడిఎంకేతో రాజకీయ పయనం అని ప్రకటించిన దీపా, గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు సెల్వం ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు కర్పూర హారతులు పలుకుతూ పన్నీరు శిబిరం ఆహ్వానించింది.
వెళ్లాల్సిన చోటికే వెళ్లారు: అక్రమ ఆస్తుల కేసులో శశికళ వెళ్లాల్సిన చోటకే వెళ్లారని దీపా ఎద్దేవా చేశారు. నాలుగేళ్లపాటు జైలు శిక్ష శశికళకు విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో దీప ఇంటి ముందు గుమికూడిన కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాల్కనీ నుంచి తన కోసం వచ్చిన కార్యకర్తలకు ఆమె అభివాదం చేశారు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని, శశికళకు విధించిన శిక్ష సరైనదేనని పేర్కొన్నారు.