అభివృద్ధి కోసం హస్తానికి ఓటేయండి
Published Mon, Nov 25 2013 2:20 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
న్యూఢిల్లీ: నగరం మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ఓటు వేయాలని ఢిల్లీ వాసులను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. ఈశాన్య ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు జేపీ అగర్వాల్ తరఫున ప్రచారం చేసేం దుకు ఇక్కడి డీడీఏ గ్రౌండ్‌లోని శాస్త్రీపార్క్‌లో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో సోనియా పాల్గొన్నారు. షీలాదీక్షిత్ ప్రభుత్వం పాలనలో గత 15 సంవత్సరాలుగా ఢిల్లీలో ఎంతో అభివృద్ధి జరిగిందని, మరింత అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. ఢిల్లీ నగరం దేశంలోని మరెన్నో నగరాలకు ఆదర్శంగా మారిందని, ఢిల్లీ మెట్రో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందన్నారు.
ఇక్కడిఉద్యోగులు ఇరుకు బస్సుల్లో ఇబ్బందులు పడుతూ కార్యాలయాలకు ఎంతమాత్రం వెళ్లరని చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పలు అభివృద్ధి పనులను ఏకరువు పెట్టారు. అయితే ప్రతిపక్షం మాత్రం తాము చేసిన అభివృద్ధిని కప్పిపుచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాను ఢిల్లీ వాసినేనని, ఢిల్లీలో జరిగిన అభివృద్ధి పనులకు తానే సాక్షినన్నారు. ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవేనని కొట్టిపారేశారు. ఇటీవల బీజేపీ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ చేస్తున్న విమర్శలను మోడీ పేరును ఉచ్ఛరించకుండానే తిప్పికొట్టారు. దేశాభివృద్ధికోసం పాటుపడిన ఎవరినీ కాంగ్రెస్ పార్టీ విస్మరించదన్నారు. సోనియా ప్రసంగం దాదాపు మోడీపై విమర్శలతోనే కొనసాగినా ఢిల్లీలో కాంగ్రెస్ గెలుపుకోసం షీలా పాలనను కూడా ప్రశంసించారు.
Advertisement
Advertisement