షీలా దీక్షిత్ ను సోనియా గాంధీ ప్రశంసలు
Published Tue, Aug 20 2013 10:40 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ నాయకత్వంలో నగర రూపురేఖలు మారిపోయాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రశంసించారు. రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని మంగళవారం సెంట్రల్ ఢిల్లీలోని తల్కటోర స్టేడియంలో ఆహార భద్రత పథకాన్ని సోనియా గాంధీ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గత 15 ఏళ్ల నుంచి నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి వేగిరాన్ని పుంజుకుందన్నారు. 15 ఏళ్ల క్రితం ఉన్న ఢిల్లీని ప్రస్తుతమున్న నగరాన్ని పొల్చిచూసుకుంటే మార్పు స్పష్టంగా కనిపిస్తుందని ఆమె తెలిపారు. నిత్యావసర సదుపాయాలను మెరుగుపరిచి సామాన్యూల జీవన విధానాలను ఢిల్లీ సర్కార్ పెంచిందన్నారు.
షీలాతోపాటు ఆమె మంత్రు బృంధం వివిధ ప్రజా సంక్షేమ పథకాలను చేపట్టిందని కొనియాడారు. దేశంలోనే తొలిసారిగా న్యూఢిల్లీలో ఆహార భద్రత పథకాన్ని ప్రారంభిం చేందుకు ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ చొరవ తీసుకున్నారని సోనియా గాంధీ ప్రశంసలు కురిపించారు. నగరంలో మౌలిక వసతుల అభివృద్ధికి ఆమె ఎంతో పారదర్శకతతో పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ మాట్లాడుతూ ఆహార భద్రతా బిల్లును పార్లమెంటులో ఆమోదించకముందే ఈ పథకాన్ని ఢిల్లీలో ప్రారంభించడాన్ని సమర్థించుకున్నారు. దీనివల్ల లక్షలాది మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న ఈ ఆహార బిల్లు పథకాన్ని దేశంలోనే ప్రథమంగా ఢిల్లీలో ప్రారంభించడం ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ఈ పథకం కింద ఢిల్లీలో 73.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. నిరాశ్రయులు, రోజు కూలీలు, చెత్త ఏరుకునేవారు, పునరావాస కాలనీలు, మురికివాడలలో నివసించేవారిని లబ్దిదారులలో చేరుస్తామని తెలిపారు. అయితే పార్లమెంట్‌లో ఈ ఆహార భద్రత బిల్లును అడ్డుకోవడానికి బీజేపీ ప్రయత్నించడం విచారం కలిగిస్తోందన్నారు. తాము ఏ తప్పు చేయడం లేదని, ఏ నియమావళిని ఉల్లంఘించడం లేదని చెప్పారు.
ఇది ఓట్ల పథకం: బీజేపీ
తల్కటోర స్టేడియంలో సోనియా గాంధీ చేతుల మీదుగా మంగళవారం ప్రారంభమైన ఆహార భద్రతా పథకాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. స్టేడియం ఎదుట గుమిగూడిన బీజేపీ కార్యకర్తలు ఆహార భద్రతా పథకానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజయ్ గోయల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పాల్గొన్న కార్యకర్తలను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు వాటర్ కేనన్లు ఉపయోగించారు. శాంతియుతంగా తాము ఆందోళన చేస్తుంటే పోలీసులే అత్యుత్సాహపడి వాటర్ కేన్లను ప్రయోగించారని గోయల్ మండిపడ్డారు. దీని ద్వారా ప్రజా వ్యతిరేకమని కాంగ్రెస్ ప్రభుత్వ నిరూపించుకుందని, అధికారంలో ఉండే అర్హతను కోల్పోయిందన్నారు.
ఇది ఆహార భద్రత బిల్లు కాదని, ఓట్ల కోసం తెచ్చిన పథకమని మండిపడ్డారు. అసెం బ్లీ ఎన్నికలకు ముందు దీన్ని అతృతగా ప్రారంభిం చడంలో రాజకీయ గిమ్మిక్కుగా అభివర్ణించారు. 14 పత్ మార్గ్‌లోని ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ఆందోళనను రాంమనోహ ర్ లీలావతి ఆస్పత్రి సమీపంలోని తల్కోటర ప్రాం తం వద్ద మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు వాటర్‌కేన్లను ప్రయోగించారు.
ఢిల్లీలో ఆహార భద్రత!
*** కోటికి పైగా ఉన్న నగర జనాభాలో 73 లక్షల మంది ఆహార హక్కును పొందుతారు. రెండో దశల్లో దీనిని అమలు చేస్తారు.
*** ఆహార ధాన్యాలు అందకపోతే, లబ్ధిదారులకు అంతే మొత్తంలో నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు.
*** నిరాశ్రయులు, చెత్త ఏరుకునే వారు, పునరావాస కాలనీల్లోని వారు ఈ పథకానికి అర్హులు
*** మొదటి దశలో ఐదు లక్షల మందికి సబ్సిడీపై ఆహారధాన్యాలు అందచేస్తారు. గోదుమలు కిలో రూ.2, బియ్యం కిలో రూ.3, ముతక ధాన్యాలు కిలో రూ.1కి అందచేస్తారు.
*** దారిద్య్ర రేఖకు దిగువన, ఎగువన ఉన్న వారు, జుగ్గీ రేషన్‌కార్డుదారులను ఈ పథకంలో చేరుస్తారు
*** ఢిల్లీ ప్రభుత్వ ఆహార, సరఫరాల విభాగానాకి చెందిన 200 కేంద్రాలు, కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు
*** లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులు జారీ చేస్తారు.
*** రెండో దశను ఫిబ్రవరి 2014లో ప్రారంభిస్తారు.
Advertisement
Advertisement