ఈరోజైనా తేలేనా?
న్యూఢిల్లీ: ఢిల్లీలో రాజకీయ స్థితిపై అనుసరించే వ్యూహాన్ని వారం రోజులలో నిర్ణయిస్తారని ఢిల్లీ బీజేపీ ఇన్‌చార్జ్ ప్రభాత్ ఝా ప్రకటించడంతో నగరంలో జరుగుతోన్న బీజేపీ అగ్రనేతల సమావేశాలన్నింటినీ ఢిల్లీ బీజేపీ నేతలతో పాటు రాజకీయ పరిశీలకులు ఆసక్తితో గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం నితిన్ గడ్కరీ నివాసంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలకు మధ్య జరిగిన సమావేశం, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ల మధ్య జరిగిన సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్‌నేతల సమావేశం
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నివాసంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు, రామ్ గోపాల్, భయ్యాజీ జోషీ, సురేష్ సోనీలు బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశాన్ని ఢిల్లీ బీజేపీ నేతలు వేయికళ్లతో గమనించారు. అయితే ఈ సమావేశంలో ఢిల్లీ ప్రస్తావన వచ్చినట్లు తేలకపోవడంతో వారి దృష్టి శుక్రవారం జరగనున్న పార్లమెంటరీ బోర్డు సమావేశంపైకి మళ్లింది. నాలుగు రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించే వ్యూహాల గురించి చర్చించనున్న ఈ సమావేశంలో ఢిల్లీ రాజకీయ పరిస్థితిపై అనుసరించవలసిన వ్యూహం గురించి కూడా బీజేపీ నాయకత్వం ఒక నిర్ణయానికి రావచ్చని వారు ఆశిస్తున్నారు.
రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన ఎల్జీ..
లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను గురువారం సాయంత్రం హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కలిశారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై నెలకొన్న అనిశ్చితి దృష్ట్యా ఈ సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎల్జీ ఆహ్వానిస్తే ప్రభుత్వం ఏర్పాటుకు సుముఖమేనని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఇటీవల వెల్లడించినప్పటి నుంచి ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యా బలం లేదని, ప్రభుత్వం ఏర్పాటుకు ఆ పార్టీని ఆహ్వానించినట్లయితే ఎమ్మెల్యేల బేరసారాలను ప్రోత్సహించినట్లవుతుందని అరవింద్ కేజ్రీవాల్ నేత ృత్వంలోని ఆప్ బృందం ఎల్జీని కలిసి హెచ్చరించింది. దీనిపై ఎల్జీ స్పందిస్తూ.. ఇతరులను కూడా సంప్రదించి రాష్ట్రపతికి నివేదిక సమర్పిస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో నజీబ్ జంగ్ హోం మంత్రిని కలవడం చర్చనీయాంశంగా మారింది.
పార్టీ నిర్ణయం శిరోధార్యం: ఢిల్లీ బీజేపీ
ప్రభుత్వం ఏర్పాటుపై ఎమ్మెల్యేలతో పాటు ఏడుగురు పార్లమెంటు సభ్యుల అభిప్రాయాలను జాతీయ నాయకత్వానికి తెలియచేశామని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఢిల్లీ బీజేపీ నేతలకు శిరోధార్యమని ఢిల్లీ బీజేపీ ఇన్‌చార్జ్ ప్రభాత్ ఝా తెలిపారు. ఎన్నికలతో సహా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఢిల్లీ బీజేపీ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటుచేయడం కోసం తమ పార్టీ అనైతిక పద్ధతులకు పాల్పడబోదని తెలిపారు.
ఎన్నికలకే వెళ్దామంటున్న కార్యకర్తలు..
ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామా? ఎన్నికలకు వెళ్దామా? అనే విషయంలో ఎటూ తేల్చుకోలేక పోతున్న పార్టీ అధిష్టానం పార్టీలో కిందిస్థాయి కార్యకర్తల నుంచి అభిప్రాయాన్ని కూడా సేకరించిం దని సమాచారం. ఉత్తర, దక్షిణ, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లలో అభిప్రాయాన్ని సేకరిం చగా వచ్చిన నివేదికల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చినట్లు పార్టీ నేత ఒకరు తెలిపారు. అయితే కిందిస్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు అందరి నుంచి ఎన్నికలకు వెళ్దా మనే అభిప్రాయమే వ్యక్తమైందని, నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. దీంతో శుక్రవారం జరగనున్న పార్లమెం టరీ బోర్డు సమావేశంలో కార్యకర్తల అభిప్రాయాల ను కూడా పరిగణనలోకి తీసుకొని, నిర్ణయం తీసు కోవాలని పార్టీ భావిస్తోందని చెబుతున్నారు. అదే నిజమైతే కమలనాథులు ప్రభుత్వ ఏర్పాటుపై కాకుండా ఎన్నికలకు వెళ్లేందుకే సిద్ధమవుతారంటు న్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు వెళ్లడమే పార్టీకి ప్రయోజనకరమంటున్నారు.