కాంగ్రెస్‌తో పొత్తుకు విముఖత | dmk not showing interest alliance with congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తో పొత్తుకు విముఖత

Published Sat, Mar 8 2014 2:40 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

dmk not showing interest alliance with congress

 చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో బలమైన కూటమిని ఏర్పాటు చేసుకుని అధిక స్థానాల్లో గెలుపొందాలన్న కాంగ్రెస్ ఆశలపై డీఎంకే, డీఎండీకే నీళ్లు చల్లారుు. ఒంటరిపోరు అనివార్యమైంది. పోటీ చేసేందుకు సొంత పార్టీ నేతలే వెనకడుగు వేస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేసిన డీఎంకేను తాత్కాలికంగా పక్కనపెట్టి డీఎండీకేతో జతకట్టేందుకు కాంగ్రెస్ తహతహలాడింది. డీఎండీకే బీజేపీకి చేరువయ్యే అవకాశాలకు గండికొట్టాలనే ఆలోచనే ఇందుకు ప్రధాన కారణం.
 
  రాష్ట్ర సమస్యల పేరుతో డీఎండీకే అధినేత విజయకాంత్ బృందాన్ని కాంగ్రెస్ ఢిల్లీకి పిలిపించుకుని ప్రధాని మన్మోహ న్‌సింగ్‌తో గ్రూపు ఫొటో దిగే అవకాశాన్ని సైతం కల్పించింది. ఆ తరువాత కాంగ్రెస్ విషయంలో ఆచితూచి అడుగేసిన కెప్టెన్ బీజేపీతో పొత్తుకు పచ్చజెండా ఊపారు. దీంతో ఖంగుతిన్న కాంగ్రెస్ గత్యం తరం లేని పరిస్థితుల్లో డీఎంకే వైపు మరోసారి దృష్టి సారించింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తుపెట్టుకుని మంచి ఫలితాలు దక్కించుకున్న కాంగ్రెస్ ఈ సారి కూడా అదే స్థాయిలో అందలం ఎక్కాలని ఆశపడింది.
 
  కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునే ప్రసక్తేలేదని డీఎంకే ఇప్పటికే అనేకసార్లు ఖరాఖండిగా చెప్పినా, సర్వసభ్య సమావేశంలో అధికారికంగా తీర్మానం చేసినా ప్రయత్నాలు మాత్రం కొనసాగించారు. చివరి ప్రయత్నంగా కేంద్రమంత్రి పి.చిదంబరంను రంగంలోకి దించారు. కాంగ్రెస్ దూతగా డీఎంకేతో రాయబారం నడిపేందుకు రెండురోజుల క్రితం చెన్నై చేరుకున్న చిదంబరం ఆ పార్టీ కోశాధికారి స్టాలిన్‌తో సుదీర్ఘ మంతనాలు జరిపారు. తొలిరోజునే ఛేదు అనుభవాలను ఎదురుచూసిన చిదంబరం మలిరోజున స్టాలిన్‌ను బుజ్జగించారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలని స్టాలిన్ సున్నితంగా తిరస్కరించారు.
 
 యూపీఏ ప్రభుత్వ వైఖరి వల్ల శ్రీలంక తమిళుల సమస్య జఠిలంగా మారిందని, కచ్చదీవుల వివాదం వల్ల తమిళ జాలర్ల సమస్య తీరనేలేదని పేర్కొన్నారు. వీటికి తోడు రాజీవ్ హత్యకేసులో ఏడుగురి విడుదలపై రాష్ట్రం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సవాల్ చేయడం వల్ల ప్రజలు కాంగ్రెస్‌ను ఈసడించుకుంటున్నారని స్టాలిన్ ఆయనకు వివరించారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల డీఎంకే భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వబోమని స్టాలిన్ హామీ ఇవ్వడంతో చిదంబరానికి కొంత సంతృప్తి మిగిల్చింది.
 
 కాంగ్రెస్‌లో అయోమయం
 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిపోరు దుస్సాహసమే అవుతుందని ఆ పార్టీ నేతలకు తెలుసు. అన్నాడీఎంకే, డీఎంకే ఒకవైపు, ప్రాంతీయ పార్టీలైన డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకేలతో బలమైన కూటమిగా ఏర్పాటైన బీజేపీని కాంగ్రెస్ ఎలా ఢీకొంటుందని డీలా పడిపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో 40 స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు ముందుకు వస్తాయా, అసలు పోటీ చేయాలా వద్దా అనే అనుమానం వారిలో నాటుకుపోయింది.
 
 రెండు రోజుల్లో డీఎంకే జాబితా
 రాష్ట్రంలో పొత్తులు కొలిక్కిరావడం, కాంగ్రెస్‌తో చెలిమి లేదని తేలిపోవడంతో కరుణానిధి అధ్యక్షతన శుక్రవారం డీఎంకే సమావేశమైంది. ఎన్నికల్లో పార్టీ వ్యూహం, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు. మరో రెండు రోజుల్లో డీఎంకే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు సమావేశంలో ప్రకటించారు. గత ఎన్నికల్లో 22 స్థానాల్లో పోటీచేసి 18 స్థానాలు గెలుపొందగా ఈ సారి అంతకంటే ఎక్కువ సీట్లు దక్కించుకోవాలని పిలుపునిచ్చారు. ఇందులో పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్, కోశాధికారి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement