న్యూఢిల్లీ : తాగిన మైకంలో డ్రైవింగ్ చేసిన వ్యక్తికి నాలుగురోజులపాటు జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు చెప్పిన తీర్పును వాయిదా వే యాలని వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఇలాంటి కేసుల వల్ల సమాజం తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని, ఇలాంటి కేసులను ఉపేక్షించేది లేదని పేర్కొంది. డ్రంకెన్ డ్రైవ్ కేసులో శిక్షపడిన ఢిల్లీకి చెందిన సంజీవ్ దువా వేసిన పిటిషన్‌పై అదనపు సెషన్స్ జడ్జి గిరీష్ కతాపియా పై విధంగా స్పందించారు. తాగి డ్రైవ్ చేయడాన్ని ట్రయల్ కోర్టు తీవ్రంగా పరిగణించి నిందితుడికి ఆర్థికపరమైన జరిమానా కూడా విధించిందని, అయినప్పటికీ నేర తీవ్రతను అర్థం చేసుకొన్నట్లు లేదని జడ్జి వ్యాఖ్యానించారు. ఆర్థిక పరమైన జరిమానా విధించడం వల్ల ఇలాంటి చర్యలు పునరావృతం కావని పేర్కొన్నారు. అదేవిధంగా నిందితుడు చేసింది తప్పుగా భావించడం లేదని, ఇతడికి శిక్ష అమలు చేయకుంటే, సమాజానికి తప్పుడు సంకేతం వెళుతోందని తెలిపారు.
తాగి డ్రైవింగ్ చేసిన సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయని, దీని వల్ల పలువురు మరణాలు, అంగవైకల్యం బారిన పడుతున్నారని చెప్పారు. ట్రయల్ కోర్టు ఎదుట దువా నేరం అంగీకరించాడు. ఈ మేరకు 4 రోజుల జైలు, రూ. 3,600 జరిమానా విధించిందని తెలిపారు. అక్టోబర్ 9, 2014 సాయంత్రం తాగిన మైకంలో కారు డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ సమయంలో అనుమతికి మించి 23 రెట్లు అల్కాహాల్ తాగినట్లు బ్రీతింగ్ అనలైజర్ టెస్టులో తేలింది. కారు కూడా నిందితుడి సొంతానిది కాదు, అనుమతించబడిన డ్రైవింగ్ లెసైన్స్ లేదు. ఇన్సూరెన్స్ పత్రాలు, పర్యావరణ అనుమతి పత్రాలు లేవు. ఈ మేరకు పోలీసులు మోటార్ వెహికిల్ యాక్టు కింద కేసు నమోదు చేశారు. దీని ప్రకారం మొదటిసారి నిందితుడు తప్పు చేస్తే సుమారు ఆర్నెళ్ల జైలు శిక్ష విధించాల్సి ఉంటోంది. కానీ, మెజిస్ట్రేట్ సాధారణ శిక్ష మాత్రమే విధించారు. ఈ విషయాలను పరిశీలించిన కోర్టు పిటిషనర్ విజ్ఞప్తిని నిరాకరించింది. దువాను కస్టడీకి తీసుకొని నాలుగు రోజుల జైలు శిక్షను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
‘డ్రంకెన్ డ్రైవింగ్ కేసులను ఉపేక్షించేది లేదు’
Published Sat, Nov 15 2014 10:51 PM | Last Updated on Fri, May 25 2018 2:06 PM
Advertisement
Advertisement