కర్ణాటక విపక్ష బీజేపీలో అసమ్మతి మరోసారి బహిర్గతమయ్యింది.
బెంగళూరు : కర్ణాటక విపక్ష బీజేపీలో అసమ్మతి మరోసారి బహిర్గతమయ్యింది. ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప, సీనియర్ నేత ఈశ్వరప్ప మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇప్పటీకే యెడ్డీ వర్గీయులు ఈశ్వరప్పకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఆయన స్థాపించిన రాయణ్ణ బ్రిగేడ్ ముఖ్యమా, బీజేపీ ముఖ్యమా తేల్చుకోవాలని సూచనలు చేశారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడుతూ... ఈశ్వరప్ప సమస్యలు సృష్టిస్తున్నారని, ఆయన ఎందుకు అలా చేస్తోన్నారో అర్థం కావడం లేదన్నారు. ఒకవేళ పదవి విషయానికి సంబంధించిన వ్యవహారం అయితే తాము చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామని తెలిపారు.
మరోవైపు నిన్నటివరకూ దూకుడుగా వ్యవహరించిన ఈశ్వరప్ప దూకుడు తగ్గింది. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని, పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని ఆయన తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యడ్యూరప్పే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఈశ్వరప్ప వ్యాఖ్యానించారు. కాగా ఈశ్వరప్ప ప్యాలెస్ మైదానంలో ప్రత్యేక సభను నిర్వహించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా యడ్యూరప్పకు అధికారం ఇవ్వాలంటూ పలువురు బీజేపీ నేతలు పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాను కోరారు. పార్టీ నాయకులు అనుసరిస్తున్న విధానాలు నచ్చకపోతే పార్టీ జాతీయ నాయకులకు ఫిర్యాదు చేయాలని అంతేకానీ వ్యక్తిగత లాభం కోసం పార్టీని కించపరచవద్దని సూచించారు.
బీజేపీ పార్టీలో సీనియర్ నాయకుడైన ఈశ్వరప్ప విధానసభ ఎన్నికల్లో ఓటమి చెందినా విధాన పరిషత్‌లో పార్టీ పదవిని అప్పగించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈశ్వరప్ప ఇదే రీతిలో వ్యవహరిస్తే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు గానూ ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈశ్వరప్ప కాస్త వెనక్కి తగ్గి యడ్యూరప్పతో సయోధ్యకు సిద్ధం కావడం విశేషం.