షోలాపూర్, న్యూస్‌లైన్: గత పదేళ్లుగా పట్టణంలోని వస్త్ర పరిశ్రమ కార్మిక లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. చద్దర్లు ఉత్పత్తి చేసే మరమగ్గాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. చద్దర్లు నేసే మరమగ్గాలపై పనిచేసే కార్మికుల సంఖ్య ఏడేనిమిదేళ్లలో 80 శాతానికిపైగా పడిపోయిందని మరమగ్గాల సంఘం అధ్యక్షుడు పెంటప్ప గడ్డం ‘న్యూస్‌లైన్ ’తో వివరించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. చద్దర్ల మగ్గాలతోపాటు టవెల్స్ మగ్గాల కార్ఖాణాలు కూడా రోజుకోకటి మూతపడుతున్నాయన్నారు. ప్రస్తుతం వంద చద్దర్ల మరమగ్గాలకు కేవలం 40 మంది కార్మికులు మాత్రమే ఉన్నారని చెప్పారు. అంటే రెండు మగ్గాల భారం ఒకే కార్మికుడిపై పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చద్దర్ల మరమగ్గాలు నడిపేందుకు యువతరం ఆసక్తి చూపడం లేదని, భవిష్యత్తులో ఈ మరమగ్గాలు నడిపేవారు దొరకడం మరింత కష్టంగా మారనుం దన్నారు. దీంతో ప్రపంచ ఖ్యాతి గడించిన షోలాపూర్ చద్దర్ తన ఉనికిని కోల్పోయే ప్రమాదముం దని వస్త్రవ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
షోలాపూర్ చద్దర్ తన అస్తిత్వాన్ని నిలదొక్కుకోలేక పోవడానికి అనేక కారణాలున్నాయి. టవెల్స్ ఉత్పత్తులకు సంబంధించి కొత్త కొత్త టెక్నాలజీతో రూపొందించిన అత్యాధునిక మరమగ్గాలు కాలక్రమేణ మార్పులు చెందుతూ ఉత్పత్తిలో కొత్తదనాన్ని సంతరించుకుంటున్నాయి. కానీ చద్దర్లు ఉత్పత్తి చేసే కార్ఖాణాలలో మాత్రం ఇలాంటి అత్యాధునిక మరమగ్గాలు ఇంతవరకు రాలేదు. అందుకే వీటిల్లో పని చేసేందుకు కార్మికులు కూడా ఉత్సాహం కనబర్చడం లేదు. అందుకే గత ఏడెనమిదేళ్లుగా చద్దర్ల మరమగ్గం నడిపేందుకు ఏ ఒక్క కార్మికుడు చేరలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం పట్టణంలో చద్దర్లు ఉత్పత్తి చేసే మరమగ్గాలపై పనిచేసే దాదాపు 1,200 మంది కార్మికుల వయస్సు 45 నుంచి 50 పైబడి ఉంది. అయితే ఈ మరమగ్గాపై పనిచేసేందుకు కొత్తగా ఎవరూ చేరకపోవడంతో ఒక్క కార్మికుడే రెండేసి మరమగ్గాలు రోజుకు 8 నుంచి 10 గంటలపాటు నడుపుతున్నాడు. ఇంత కష్టపడినా వారికి లభించేది కేవలం రూ. 300 మాత్రమే. ఇలా వేతనాలు తక్కువగా ఉండడం కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు. చద్దర్ల ఉత్పత్తికి అత్యాధునిక మరమగ్గాలు తప్ప ప్రస్తుత తరుణంలో మరో గత్యంతరం లేదని కార్ఖానాల నిర్వాహకులు చెబుతున్నారు. ఆధునిక మగ్గాలపై పనిచేసే కార్మికుల కోసం శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందంటున్నారు. కాగా శిక్షణ కేంద్రాల ఏర్పాటు కోసం మరమగ్గాల సంఘం సిద్ధంగా ఉందని పెంటప్ప స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు కూడా ఈ రంగంపై దృష్టి సారించాలని ఆయన కోరారు.
100 మర మగ్గాలు.. 40 మంది కార్మికులు!
Published Mon, Dec 30 2013 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
Advertisement
Advertisement