సమస్యల ‘అసెంబ్లీ’
సమస్యల ‘అసెంబ్లీ’
Published Tue, Mar 7 2017 4:04 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
– బందోబస్తు పేరుతో పోలీసుల అతి
– అసెంబ్లీ పాస్‌లు ఉన్నా ఐడెంటీకార్డులు చూపాలంటూ హడావుడి
– మండే ఎండలో మంచినీళ్లు లేక అవస్థలు
– అసెంబ్లీలోను మంచినీరు లేదు.. బాత్‌రూమ్‌లో నీరు రాదు
– రెండవ రోజునే బయటపడ్డ డొల్లతనం
అమరావతి : అమరావతిలో అద్బుతంగా అసెంబ్లీ అంటూ అధికారపక్షం గొప్పలు చెబుతున్నప్పటికీ రెండవరోజునే డొల్లతనం బయటపడింది. భద్రతా సిబ్బంది అతిగా వ్యవహరించడం దగ్గర్నుంచి కనీస అవసరమైన మంచినీరు వరకు అసెంబ్లీ చుట్టూ అన్నీ సమస్యలే. మొదటి రోజు వినయంగా వ్యవహరించిన పోలీసులు రెండవ రోజు అతి జాగ్రత్తల పేరుతో హడావుడి చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల ఆదేశాలతో అసెంబ్లీ వద్ద బందోబస్తు సిబ్బంది నానా హంగామా చేశారు. జర్నలిస్టులకు అసెంబ్లీ కార్యదర్శి సంతకంతో జారీ చేసిన పాస్‌లు చూపించినప్పటికీ వదలని పోలీసులు మీ ఐడెంటీ కార్డు చూపాలంటూ పట్టుబట్టారు. ఐదు అంచెల పోలీసుల తనిఖీలు దాటుకుంటే గానీ అసెంబ్లీ ఆవరణలోకి వెళ్లలేని పరిస్థితి. ప్రతీచోట పాస్, ఐడెంటీకార్డు చూపించాలని అడటం గమనార్హం.
అన్నింటినీ దాటుకుని వస్తే మీడియా పాయింట్ సమీపంలో కాసిన పోలీసులు ప్రతీ జర్నలిస్టు పేరు, మీడియా సంస్థ, ఫోన్ నెంబర్ చెప్పాలంటూ నమోదు చేసుకోవడం ఇబ్బందికరంగా మారింది. పోలీసుల తీరుపై పలువురు మీడియా ప్రతినిధులు మండిపడటంతో మాకెందుకు సార్ మా బాస్ చెప్పారు. మేం ఉద్యోగం చేయాలి కాబట్టి తప్పదు. మీకు కోపం వద్దు సార్.. మీ ఇబ్బందులు ఏమైనా ఉంటే మా బాస్‌ల దృష్టిలో పెట్టండి.. అంటూ పలువురు భద్రతా సిబ్బంది వాపోయారు. ఇంత చేస్తే మండే ఎండలో షెడ్డులాంటి మీడియా పాయింట్‌లో విలేకరులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాయడం ఇబ్బందికరంగా మారింది. కనీసం గొంతు తడుపుకొనేందుకు కూడా మంచినీటి సౌకర్యం లేదు. ఉదయం ఏదో ఒక గంట మంచినీళ్ల టిన్ పెట్టి వదిలేసిన సిబ్బంది అటు తరువాత అక్కడ మంచినీరు ఉందో లేదో చూసిన సందర్బంలేదు.
పనిచేయని మైక్‌లు..
కొత్త టెక్నాలజీ పేరుతో వేసిన మైక్‌లు సక్రమంగా పనిచేయలేదు. ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పీకర్ కోడెల శివప్రసాద్ దృష్టికి తెచ్చారు. గతంలో మైక్‌లు పనిచేస్తున్నది లేనిది తెలిసేదని, ఇప్పుడు ఈ మైక్‌లు కన్పించకపోవడంతో అసలు పనిచేస్తున్నాయో లేదో తెలియడంలేదని జగన్‌మోహన్‌రెడ్డి వివరించారు. అసెంబ్లీ గ్యాలరీలో సిట్టింగ్‌ను స్టెప్‌లుగా కాకుండా సమాంతరం(ప్లాట్)గా వేయడంతో వెనుక కూర్చున్నవారికి ముందు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మైక్‌లు మోరాయించడంతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రాయకృష్ణుడు మాట్లాడింది అసలు విన్పించలేదు. దీంతో పలువురు జర్నలిస్టులు మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌కు ఫిర్యాదు చేశారు. సభలో ప్రశ్నోత్తరాలు, జవాబులకు సంబంధించిన సమాచార ప్రతిని ఇచ్చే నాథుడు లేక ఐఅండ్‌పీఆర్ అధికారులతో జర్నలిస్టులు వాగ్వావాదానికి దిగారు.
ఈ దశలో అక్కడికి వచ్చిన ఐఅండ్‌పీఆర్ జాయింట్ డైరెక్టర్ కిరణ్ తనే స్వయంగా వాటిని తెచ్చి కొందరికి పంచిపెట్టడం గమనార్హం. మండలి ప్రెస్ గ్యాలరీలో సీట్లు వేసేందుకు చోటు ఉన్నప్పటికీ ఫిక్సిడ్‌గా 17 సీట్లు మాత్రమే వేయడంతో గంటల తరబడి నిలబడే రాసుకున్నారు. సభలో మైక్(వాయిస్) విన్పించకపోవడంతో ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియక అటు సభ్యులు, ఇటు జర్నలిస్టులు ఇబ్బందిపడాల్సి వచ్చింది. అసెంబ్లీ సిట్టింగ్ బాగుండటంతో కూర్చుంటే నిద్రవస్తోందని, అయితే ఏ సీటు ఎవరికి కేటాయించింది తెలియకపోవడంతో వెతుక్కోవడానికి అష్టకష్టాలు పడాల్సివస్తోందని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు మీడియా వద్ద ప్రస్తావించారు.
గొంతెండిపోతున్న గుక్కెడు నీరు ఇవ్వలేదు..
కొత్త అసెంబ్లీ ఆర్బాటాపు హంగులు ఉన్నాయి తప్పా అందులో కనీసం మంచినీరు ఇచ్చే దిక్కులేదని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులను లోనికి మంచినీరు తెచ్చుకునే అనుమతి ఇవ్వలేదు. కనీసం గంటల తరబడి సభలో ఉండే సభ్యుల వద్దకు వెళ్లి మంచినీరు అందించే ఏర్పాట్లు చేయకపోడం విమర్శలకు తావిచ్చింది. సభ్యుల వద్దకు మంచినీటిని సరఫరా చేసే విషయంలో శ్రద్ద చూపలేదని, మండే వేసవిలో ఇది చాలా దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియా పాయింట్‌లో వాపోయారు. కనీసం బాత్‌రూమ్‌ల కూడా నీటి సరఫరా సక్రమంగా లేదని, ఊరి చివరకు బాటిల్‌తో పట్టుకుని బహిర్బూమికి వెళ్లాలా? అంటూ మీడియా వద్ద చెవిరెడ్డి ప్రశ్నించారు.
Advertisement