నకిలీ పాస్‌పోర్టు ముఠా అరెస్ట్
కేకే.నగర్: నకిలీ పాస్‌పోర్టు, వీసాలను తయారు చేసి దాని ద్వారా శ్రీలంక తమిళులను విదేశాలకు పంపిన శ్రీలంకకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నకిలీ పాస్‌పోర్టులు, దాన్ని తయారు చేసే కంప్యూటర్‌తో సహా కొన్ని పరికరాలను, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. కొందరు నకిలీ పాస్‌పోర్టు, వీసాలను తయారు చేస్తున్నారని పోలీసులకు రహస్య సమాచారం అందింది. నిందితులను అరెస్టు చేయాలని పోలీసు కమిషనర్ టి.కె.రాజేంద్రన్, కేంద్ర క్రైం బ్రాంచ్‌కు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో కేంద్ర నేర విభాగ అదనపు పోలీసు కమిషనర్ అరుణాచలం నేతృత్వంలో ప్రత్యేక బృందం పోలీసులు చెన్నైలోని పలు ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. ఆ సమయంలో తిరుముల్లైవాయల్ సమీపంలోని వైష్ణవి నగర్‌లో కొందరు తలదాచుకున్నట్లు సమాచారం తెలుసుకున్నారు. దీంతో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని జరిపిన విచారణలో కొళత్తూరుకు చెందిన నాగూర్ మీరాన్ (46) వద్ద తొమ్మిది నకిలీ పాస్‌పోర్టులు పట్టుబడ్డాయి.
వాటిని తిరుముల్లైవాయల్‌లోని గుణ నాయకం (64), సౌరిముత్తు (60)కు ఇవ్వడానికి వెళుతున్నట్లు తెలియడంతో వారిద్దరిని గత మే నెలలో పోలీసులు అరెస్టు చేశారు. వారు ఇచ్చిన వివరాల మేరకు ప్రదాన నిందితులైన మూర్తి అలియాస్ కృష్ణమూర్తి (66), మురళీధరన్, రాజన్‌లను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో వీరు నకిలీ పాస్‌పోర్టులను, వీసాలను తయారు చేసి శ్రీలంకకు చెందిన వారిని విదేశాలకు పంపిస్తున్నారని తెలిసింది.
కాలం చెల్లిన, నిరుపయోగమైన పాస్‌పోర్టులను మూడువేలకు కొని వాటి లామినేషన్‌ను తీసేసి పాస్‌పోర్టు కావాలని కోరిన వారి ఫొటోలను అతికించి నకిలీ పాస్‌పోర్టు తయారు చేస్తున్నట్లు తెలిసింది. వీటిని రూ. 30 వేల నుంచి రూ.5 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. గతంలో కూడా వీరిపై కేసు నమోదైనట్లు గుర్తించారు. బుధవారం నిందితుల నుంచి 28 నకిలీ పాస్‌పోర్టులను, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకుని జైలుకు తరలించారు.