
సీఆర్‌డీఏ ఆఫీసు వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం తుళ్లురు సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట గురువారం ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెట్రోలు పోసుకుని రాంబాబు అనే రైతు ఆత్మహత్యాయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ రాజధాని నిర్మిస్తే తుళ్లురు ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పి తమ వద్ద నుంచి భూములను లాక్కున్నారని రైతు రాంబాబు వాపోయాడు.
రాజధానికి 47 సెంట్లు భూమిస్తే.. ఇప్పుడేమో 44 సెంట్ల కౌలు ఇస్తామంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏడాది నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని, దాంతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు రైతు రాంబాబు వాపోయాడు.