కమలానిదే భవిష్యత్తు
చెన్నై, సాక్షి ప్రతినిధి : ‘‘ప్రాంతీయ పార్టీలను కాదని బీజేపీ ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదే. మాతృభాషను నేర్చుకోవాల్సిందే, అలాగని ఇతర భాషల అధ్యయనంపై ఆంక్షలు విధించ డం ఎంతమాత్రం సరికాదు. హిందీ భాషను వద్దని ఉద్యమాలు నిర్వహించడం వల్ల ఎందరో నష్టపోయారు. వారిలో నేను ఉన్నా. తమిళనాడులో హిందీ వద్దని ఉద్యమాలు చేసిన ద్రవిడపార్టీల నేతలు తమ పిల్లలకు మాత్రం హిందీని నేర్పించారు.’’ అంటూ ద్రవిడ పార్టీలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విరుచుకుపడ్డారు. కోయంబత్తూరులో శనివారం రాత్రి జరిగి న పారిశ్రామిక సదస్సులో కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని, అనంతరం మీడియాతో మాట్లాడారు. మాతృభాష నేర్చుకోకూడదని తాము చెప్పడంలేదన్నారు. ఇతర భాషలు కూడా నేర్చుకోవాలని మాత్రమే చెబుతున్నామని స్పష్టం చేశారు.
ముఖ్యంగా పిల్లల అభీష్టానుసారం ఇతర భాషలు నేర్పించాలని ఆమె కోరారు. తాను మదురై జిల్లాలో పుట్టి తిరుచ్చి, విళుపురం జిల్లాల్లో చదివానని, ఆ రోజుల్లో హిందీ నేర్చుకోవాలని ఆశపడ్డానని గుర్తుచేసుకున్నారు. అయితే అప్పటి పోరాటాలు తన ఆసక్తిని అడ్డుకున్నాయని, తనలా ఎందరో నష్టపోయారని చెప్పారు. ఆంగ్లేయు లు వదిలి వెళ్లిన భాషను హాయిగా అందరూ అభ్యసిస్తున్నారు, భారతదేశంలో పుట్టిన హిందీ భాషను మాత్రం నేర్చుకోలేని నిస్సహాయతను తమిళనాడు రాష్ట్రం తనకిచ్చిందన్నారు. హిందీని వద్దంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు, ప్రచారాలు చేసిన పార్టీ నేతలు తమ పిల్లలకు మాత్రం హిందీ చెప్పించారని ఆమె విమర్శించారు. అన్ని భాషలు నేర్చుకోవాలనే తపన తమిళనాడుతోపాటూ అన్ని రాష్ట్రాల్లో పెరిగిన సంగతిని కేంద్రం గుర్తించి అందుకు అవసరమైన చర్యలను చేపడుతోందని చెప్పారు.
మద్య నిషేధంపై ఆలోచన
మద్యం మహమ్మారి దేశంలోని అన్ని రాష్ట్రాలను పట్టిపీడిస్తోందని, ఎన్నో కుటుంబాలను కాలరాస్తోందని తమ ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. దీనికి అడ్డుకట్టవేసేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక మహిళ ప్రారంభించిన ఉద్యమం మద్యనిషేధానికి కారణమైందన్నారు. మద్యనిషేధం విధించేటపుడు కల్లుగీత కార్మికులు నష్టపోకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. కల్లుగీత, చేపల వేట వంటివి చేసేది మగవారైనా, వాటిని అమ్మేది స్త్రీలు కావడంతో ప్రత్యామ్నాయ ఉపాధి అకాశాలను పరిశీలించాల్సి ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
అధికారం మాదే
తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీలదే పెత్తనంగా ఉన్న తమిళనాడులో ఒక పరాయి పార్టీగా ప్రజలు భావిస్తున్న బీజేపీకి ఎలా పట్టం కడతారనే ప్రశ్నకు ఆమె తీవ్రంగా స్పందించారు. ఒకప్పుడు రాష్ట్రం విద్య, వైద్యం, వ్యాపారం, వాణిజ్యం, పారిశ్రామికం తదితర అన్నిరంగాల్లో అగ్రస్థానంలో ఉండేదని, కానీ నేడు దిగజారిపోరుుందని చెప్పారు. ఈ దిగజారుడుకు ప్రత్యేకంగా తాను ఎవరినీ నిందించడం లేదని, అయితే ఈ పరిస్థితిలో మార్పురావాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారని తెలిపారు. కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుకురావడం బీజేపీ ప్రభుత్వానికే సాధ్యమని ప్రజలు సైతం విశ్వసిస్తున్నట్లు ఆమె అన్నారు. గత ఆరు నెలల మోదీ పాలనను చూసిన తరువాతనే తమిళనాడు ప్రజలు ఈ అభిప్రాయానికి వచ్చారని ఆమె తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం, అభిలాషను నెరవేరుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.