- విద్యాలయాలకు కలాం సూచన
సాక్షి, బెంగళూరు :విద్యార్థులను ఉద్యోగార్థులుగా కాకుండా.. ఉద్యోగ సృష్టికర్తలుగా తయారు చేయాలని ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విద్యాసంస్థలకు సూచించారు. శుక్రవారమిక్కడి ఏఎంసీ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో నిర్వహించిన కళాశాల వార్షికోత్సవ కార్యక్రమానికి కలాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ‘రోల్ ఆఫ్ యూత్ ఇన్ నేషన్ బిల్డింగ్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. కన్నడి గులందరికీ బసవ జయంతి శుభాకాంక్షలు చెబుతూ కలాం తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రతి విద్యార్థి ముందుగా కళాశాల క్యాంపస్ నుంచి బయటికి వెళ్లిన తరువాత తాను ఏదైనా సాధించగలననే ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరముందన్నారు.
కళాశాలల్లోని విద్యార్థులు తమ మెదడులోని ఆలోచనలకు పదును పెడితే ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ భారతదేశం మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు. జీవితంలో తాను ఎలాంటి శిఖరాలను అందుకోవాలనే విషయానికి పాఠశాల జీవితంలోనే పునాదులు పడ్డాయని, అందుకు తన గురువులే కారణమని అన్నారు. అదే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి తరగతి గదిలోనే తన విజయాలకు పునాదులు వేసుకోవాలని సూచించారు.
ప్రస్తుత పోటీ కాలంలో సృజనాత్మక అనేది వ్యక్తి విజయావకాశాలను నిర్దేశిస్తోందని పేర్కొన్నారు. ఏఎంసీ కళాశాలల చైర్మన్ డాక్టర్ కేఆర్ పరమహంస మాట్లాడుతూ... అన్ని వర్గాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ విద్యాసంస్థల లక్ష్యమని పేర్కొన్నారు. తమ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు మంచి ప్లేస్‌మెంట్ అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. విద్యార్థుల ప్లేస్‌మెంట్స్‌కు గాను ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్‌తో పాటు బీమా, బ్యాంకింగ్ రంగాల్లోని సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని వెల్లడించారు.