'అందుకే విశాఖకు పెట్టుబడులు రావడం లేదు'
విశాఖపట్నం: హుద్ హుద్ తుఫాను బాధితులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని విశాఖ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్ విమర్శించారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...తుఫాను బాధితులకు ఒక్క ఇళ్లైనా కట్టారా అని ప్రశ్నించారు. హుద్ హుద్ తుఫాను వచ్చి రెండేళ్లు గడిచినా బాధితులకు ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించలేదని ధ్వజమెత్తారు.
ఎంతో చేశామని టీడీపీ సర్కారు చేసుకుంటున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. రూ. 400 కోట్లు ఖర్చుపెట్టి ఉల్లిపాయలు, పప్పులు ఇచ్చారనడం శోచనీయమన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ పోరాడుతుందని ప్రకటించారు. విశాఖపట్నంలో పెట్టుబడులు పెడితే తుఫానుల వల్ల నష్టపోయే ప్రమాదం ఉందని గతంలో టీడీపీ ఎంపీ అన్నారని గుర్తు చేశారు. టీడీపీ ఎంపీ వ్యాఖ్యల వల్లే విశాఖకు పెట్టుబడులు రావడం లేదని అమరనాథ్ పేర్కొన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
- ప్రకృతిని జయించిన వీరులా చంద్రబాబు మాట్లాడుతున్నారు
- హుద్ హుద్ వల్ల కలిగిన నష్టం కంటే చంద్రబాబు పబ్లిసిటీ వల్లే విశాఖకు ఎక్కువ నష్టం జరిగింది
- తుఫాను వల్ల లక్ష కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రధానికి చంద్రబాబు చెప్పారు
- ఆనాడు తుఫాను బాధితులకు ప్రధాని వెయ్యి కోట్లు ప్రకటించారు
- కేంద్రం నుంచి రూ. 480 కోట్లు మాత్రమే నిధులు వచ్చాయని బాబు చెప్పారు
- రాష్ట్ర ప్రభుత్వం నిత్యవసరాల కోసం రూ.450 కోట్లు ఖర్చు చేశామని చెప్పింది
- ప్రపంచస్థాయిలో సేకరించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు