ఖెర్కీదౌలా టోల్‌ప్లాజా వద్ద స్థానికుల ఆందోళన
Published Thu, Sep 5 2013 4:23 AM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM
గుర్గావ్: తమ గ్రామాల్లో చెడిపోయిన రోడ్లను బాగుచేయించాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా టోల్ ప్లాజా యాజమాన్యం పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ సమాజ్ వికాస్ సమితి ఆధ్వర్యంలో స్థానికు లు 18 లేన్ల ఖెర్కీ దౌలా టోల్ ప్లాజా వద్ద ఆందోళన చేశారు. టోల్‌గేటలను బలవంతంగా తె రిచి సుమారు గంటపాటు వాహనాలకు రుసుం వసూ లు చేయకుండా విడిచిపెట్టేశారు. వివరాలిలా.. 27.7 కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న ఎక్స్‌ప్రెస్‌వేను ఢిల్లీ-గుర్గావ్ సూపర్ కనెక్టవిటీ లిమిటెడ్(డీజీఎస్‌సీఎల్) నిర్వహిస్తోంది. ఈ వేపై ఖెర్కీదౌలా, సిర్‌హోల్ బోర్డర్, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో టోల్‌ప్లాజాలు ఏర్పాటుచేశారు. కాగా, ఈ వేను ఆనుకొని నర్సింగ్‌పూర్,హసన్‌పూర్, ఖాంద్సా, హాన్స్ ఎన్‌క్లేవ్‌లు ఉన్నాయి.
ఈ గ్రామాల్లో రోడ్లు పాడవ్వడంతో మరమ్మతులు చేపట్టాలని డీజీఎస్‌సీఎల్‌కు స్థానికులు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. అయితే అది వారి విజ్ఞప్తిని పట్టించుకోవడంలేదనే ఆగ్రహంతో బుధవారం ఖెర్కీదౌలా సమీపంలోని టోల్‌ప్లాజాను బలవంతంగా తెరిపించారు. సుమారు గంటపాటు వాహనాలను ఎటువంటి రుసుం తీసుకోకుండా వదిలేశారు. అంతేకాక డీజీఎస్‌సీఎల్ వద్దకు ఉన్నతాధికారులు వచ్చేవరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని చెప్పడంతో టోల్ మేనేజర్ తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న వెంటనే డీజీఎస్‌సీఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి (సీఈవో) మనోజ్ అగర్వాల్, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ సతేంద్ర దుహాన్, ఏసీపీలు బిర్ సింగ్, విష్ణు దయాల్ తదితరులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
స్థానికులతో మంతనాలు జరిపిన తర్వాత ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లకు త్వరలోనే మరమ్మతులు చేయిస్తామని సీఈవో హామీ ఇచ్చిన అనంతరం గ్రామస్తులు తమ ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ తమ గ్రామాల పరిధిలో పలు రోడ్లు ఏడాదిగా దెబ్బతిని ఉన్నాయన్నారు. వర్షాకాలంలో రోడ్లపై గుంతల వల్ల పలు ప్రమాదాలు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై టోల్ యాజమాన్యానికి తాము ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. గత ఫిబ్రవరి 15వ తేదీన ఇదే విషయమై స్థానికులు ఆందోళన నిర్వహించి అరగంటకు పైగా టోల్‌గేట్లను బలవంతంగా తెరిచిన విషయం తెలిసిందే.
Advertisement