► 200 మంది పోలీసులపై హెల్మెట్ కేసులు
► సిఫార్సులు తెస్తే
► క్రమశిక్షణ చర్యలు
చెన్నై నలుమూలలా సుమారు 120 సెంటర్ల వద్ద కాపుకాసి మరీ ద్విచక్రవాహనదారులను పట్టుకుని కేసులు పెడుతున్నారు. చెన్నైలో సగటున రోజుకు మూడువేల కేసులు నమోదు అవుతున్నాయి. హెల్మెట్ కేసులపై రోజూవారి నివేదికలు ఇవ్వాలని చెన్నై పోలీస్ కమిషనర్ జార్జ్ ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. ఇదిలా ఉండగా, పోలీస్‌శాఖలోని కొందరు విధులకు వచ్చేటప్పుడు, విధుల నుంచి ఇంటికి వె వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించకుండా రాకపోకలు సాగిస్తున్నట్లు కమిషనర్‌కు ఫిర్యాదులు అందాయి.
దీంతో హెల్మెట్ ధరించని పోలీసు సిబ్బంది, పట్టుబడిన వారిని విడిపించాల్సిందిగా సిఫార్సులు చేసే అధికారులు, ఏ ఫోన్ నంబర్ల నుంచి ఫోన్లు చేస్తున్నారు తదితర వివరాలను ఇవ్వాల్సిందిగా ట్రాఫిక్ విభాగాన్ని ఆదేశించారు. ఎక్కువ శాతం మంది పోలీసులు హెల్మెట్ ధరించకుండా వెళుతున్నట్లు అదనపు నిఘాలో తేలింది. అలాగే కేసులు లేకుండా విడిపించాలని సైతం కొందరు అధికారులు సిఫార్సులు చేస్తున్నట్లు నిర్ధారణ అయింది. చట్టాని ధిక్కరించే వారు పోలీసులైనా సరే వదలవద్దని కమిషనర్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక హెల్మెట్ కేసుల నుంచి విముక్తికి సిఫార్సు చేసే పోలీస్ అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సిందిగా ట్రాఫిక్ పోలీస్ ఇన్‌స్పెక్టర్లను కమిషనర్ ఆదేశించారు.
కమిషనర్ జార్జ్ ఆదేశాలతో ట్రాఫిక్ పోలీసులు ద్విచక్రవాహనదారులపై నిఘా పెంచగా రెండు వారాల్లో 200 మంది పోలీసులు పట్టుబడ్డారు. ముఖ్యంగా దక్షిణ చెన్నైలో 50 మంది పోలీసులు దొరికారు. వీరందరిపైనా కేసులు బనాయించడం పోలీసు శాఖలో కలకలం రేపింది. ఇందుకు సంబంధించి ట్రాఫిక్ విభాగ పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ చెన్నైలో రెండు నెలల క్రితం 40 శాతం మంది ద్విచక్రవాహనదారులు మాత్రమే హెల్మెట్ ధరించేవారని చెప్పారు. తనిఖీలు పెరిగిపోవడంతో హెల్మెట్ ధరించే వారు 85 శాతానికి పెరిగారని, ఇది సంతోషించదగిన పరిణామమని తెలిపారు.
నెలరోజులుగా రోజుకు ఆరువేల హెల్మెట్ కేసులు నమోదవుతుండగా, హెల్మెట్ ధరించే వారి సంఖ్య పెరగడంతో కేసులు క్రమేణా తగ్గుముఖం పడుతూ రోజుకు మూడు వేలకు చేరుకున్నాయని చెప్పారు. హెల్మెట్ వాడకంలో ఎవ్వరికీ మినహాయింపు లేదని, పోలీసు శాఖలో ఉంటూ హెల్మెట్ ధరించక పోవడాన్ని మరింత తీవ్రంగా పరిగణిస్తూ శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. కేసులు నమోదైన పోలీసులు ఉన్నతాధికారుల నుంచి సిఫార్సు చేయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
పోలీస్ అయితే ఏంటీ?
Published Fri, Nov 11 2016 3:39 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement