► తస్మాత్ జాగ్రత్త అని గవర్నర్ ఆదేశం
► నగరంలో పోలీసుల తనిఖీలు
► అవాంఛనీయ సంఘటనలపై అనుమానం
రాష్ట్రంలోని రాజకీయ పరిణామల నేపథ్యంలో రాష్ట్ర రాజధాని చెన్నైలో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. నగరంలోకి అసాంఘిక శక్తులు ప్రవేశించాయనే సమాచారంతో లాడ్జీలు, అతిథిగృహాలను తనిఖీ చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఈనెల 5వ తేదీ మధ్యాహ్నం శాసనసభాపక్ష నేతగా ఎన్నికై ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. అదే రోజు ఉదయం పన్నీర్‌సెల్వం రాజీనామా చేశారు. ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు శశికళ సిద్ధమయ్యారు. అయితే ఇంతలో ముఖ్యమంత్రి పదవికి తన చేత బలవంతంగా రాజీనామా చేయించారంటూ పన్నీర్‌సెల్వం చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. ‘అలుగుటయే ఎరుగని అజాత శతృడే అలిగిన నాడు’ అన్నట్లుగా అత్యంత సౌమ్యుడిగా ముద్రపడిన పన్నీర్‌సెల్వం...శశికళపై బహిరంగంగా ధ్వజమెత్తగా పార్టీ రెండుగా చీలిపోయింది. అధికార పార్టీలో సంక్షోభం నెలకొనగా శశికళ ప్రమాణ స్వీకారం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో పన్నీర్, శశికళ పోటాపోటీగా బహిరంగ విమర్శలకు దిగాయి. ఎమ్మెల్యేల బలం తనకే ఉందంటూ శశికళ, తిరుగులేని ప్రజాబలం తన సొంతమంటూ పన్నీర్‌సెల్వం సవాళ్లు విసురుకున్నారు.
దీంతో తన వర్గ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు శశికళ క్యాంప్ రాజకీయాలకు తెరదీసారు. ఈనెల 10వ తేదీన గవర్నర్ విద్యాసాగర్‌రావును శశికళ కలిసినా ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదు. అన్నాడీఎంకేను చీల్చడం కోసమే గవర్నర్ నాన్చుడు ధోరణికి పాల్పడుతున్నారని శశికళ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ రకంగా అధికార అన్నాడీఎంకేలో పన్నీర్‌సెల్వం, శశికళ మధ్య వారం రోజులుగా ఆధిపత్య పోరుసాగుతోంది. మద్దతుదారులంతా పన్నీర్‌సెల్వం వైపు పయనిస్తుండగా శశికళ తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. శశికళ తన మద్దతుదారులతో గవర్నర్ బంగ్లా వద్ద ఆందోళనకు దిగుతుందని సమాచారం రావడంతో రాజ్‌భవన్ వద్ద పోలీసుల బందోబస్తు పెరిగింది. గవర్నర్ బంగ్లా వద్ద ఆందోళన సబబుకాదని కొందరు హితవు పలకడంతో అమ్మ సమాధి నిరాహారదీక్ష చేపట్టాలని శశికళ నిర్ణయించుకున్నట్లు మరో వార్త ప్రచారంలో ఉంది.
ఇలాంటి రాజకీయ అనిశ్చితిని అసాం«ఘిక శక్తులు అవకాశంగా తీసుకోనున్నాయని పేర్కొంటూ గవర్నర్ విద్యాసాగర్‌రావు పోలీసు శాఖను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. జల్లికట్టు ఉద్యమంలో కొన్ని అసాంఘిక శక్తులు అల్లర్లు సృష్టించగా శాంతి భద్రతల సమస్య తలెత్తింది. అమ్మ సమాధి వద్ద శశికళ నిరాహారదీక్ష చేపట్టిన పక్షంలో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానంతో నగరంలోని అన్ని అతిథిగృహాలు, లాడ్జీలను పోలీసులు తనిఖీలు చేయడం ప్రారంభించారు. అనుమానిత వ్యక్తులు దిగితే సమాచారం ఇవ్వాల్సిందిగా అన్ని లాడ్జీలకు ఆదేశాలు అందాయి.