సాక్షి, బళ్లారి : కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పురసభ సభ్యులుగా గెలుపొందిన ప్రజాప్రతినిధులు నెల కాదు.. రెండు నెలలు కాదు ఏకంగా 11 నెలలు కావస్తున్నా అధికార బాధ్యతలు అప్పగించకపోవడంతో వారు ఉత్సవ విగ్రహాల్లా ఉన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా గెలుపొందిన వారు వెంటనే అధికార బాధ్యతలు చేపట్టి తమను గెలిపించిన ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధం అవుతుంటారు. అయితే ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ఏడాది కావస్తున్నప్పటికీ బాధ్యతలు చేపట్టకపోవడంతో చేసేదేమీ లేక మిన్నకుండిపోతున్నారు.
బళ్లారి జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే జరిగాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీ, పట్టణ పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మార్చి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కార్పొరేటర్లుగా గెలుపొందిన వారు తమకు అధికార బాధ్యతలు వెంటనే అప్పగిస్తారని ఆశించారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో మేయర్, ఉప మేయర్, మున్సిపాలిటీ, పురసభ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి.
అప్పటి నుంచి నేటి వరకు స్థానిక సంస్థల తరుపున ప్రజాప్రతినిధులకు గ్రహణం పట్టింది. అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్, ఉపమేయర్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. రాష్ట్రంలో ఉన్న 9 కార్పొరేషన్లలో రెండు కార్పొరేషన్లకు ఎన్నికలు పూర్తి చేశారు. తర్వాత మంగళూరుకు చెందిన ఓ కార్పొరేటర్ మేయర్, ఉపమేయర్‌ల రిజర్వేషన్ల ప్రక్రియ సక్రమంగా లేదని కోర్టుకు వెళ్లడంతో స్థానిక సంస్థల తరుపున ఎన్నికైన ప్రజాప్రతినిధులందరికీ పదవులు అలంకరణకు శాపమైంది.
ప్రజాప్రతినిధులుగా ఎంపికై 11 నెలలైనా ఎలాంటి బాధ్యతలు చేపట్టకపోవడంతో తమను ప్రజలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. కొంత కాలం కోర్టులో నానుతూ వచ్చిన ఈ వ్యవహారం ఎట్టకేలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి రెండు నెలలలోపు మేయర్, ఉపమేయర్‌లతోపాటు మిగిలిన స్థానిక సంస్థలకు చెందిన రిజర్వేషన్ల ప్రక్రియ సక్రమంగా చేపట్టాలని సూచించడం తెలిసిందే. అయితే రెండు నెలల గడువు ఇవ్వడంతో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే లోక్‌సభ ఎన్నికల తర్వాతనే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయని పేరు చెప్పని ఓ కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశాడు. గెలుపొందిన ప్రజాప్రతినిధులకు బాధ్యతలు లేకపోవడంతో బళ్లారితోపాటు జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటి, పురసభల్లో సమస్యలు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. అధికారులది ఆడిందే ఆట పాడిందే పాటగా మారిందని పలువురు కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా ఎన్ని నెలలో..?
Published Sat, Feb 1 2014 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM
Advertisement