పొంచి ఉన్న తుపాను ముప్పు
చెన్నై: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం మరింత బలపడి బుధవారం తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో చెన్నైలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెన్నైకు ఆగ్నేయ దిశగా 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం.. ప్రస్తుతం పశ్చిమ దిశగా పయనిస్తోంది.
రాగల 24గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే నెల 2వ తేదీన కడలూరు సమీపంలోని వేదారణ్యం-చెన్నైల మధ్య తుపాను తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. నాగపట్నం, కడలూరు, కారైకల్ ఓడరేవుల్లో మొదటి ప్రమాదహెచ్చరికలు జారీ చేసింది. రేపు ఈ తుఫాను పాండిచ్ఛేరి తీరానికి చేరే అవకాశం ఉంది. ఎల్లుండి చెన్నై తీరం దాటనుంది. దీని ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.