తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ చదివిన పాఠశాల నిర్మాణ పనుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని కర్ణాటక రాష్ట్ర ...
బనశంకరి : తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ చదివిన పాఠశాల నిర్మాణ పనుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని కర్ణాటక రాష్ట్ర రజనీజీ సేవాసమితి ఆరోపించింది. బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కర్ణాటక రాష్ట్ర రజనిజీ సేవాసమితి రాష్ట్రాధ్యక్షుడు రజనిమురగన్ మాట్లాడుతూ... పాఠశాల కట్టడం నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.81 లక్షల 40 వేలు విడుదల చేసిందన్నారు. అలాగే ఎంపీ అనంతకుమార్ ఎంపీ కోటా క్రింద రూ.25 లక్షలతో పాటు వివిధ దాతల నుంచి రూ. కోటీ 67 లక్షలు సేకరించారన్నారు. కాని పాఠశాల భవన నిర్మాణం పనులు పూర్తికాకపోవడానికి కారణం తెలియడం లేదన్నారు. ఈ విషయం పై సమాధానం చెప్పాల్సిన ఎమ్మెల్యే రవిసుబ్రమణ్య మౌనం వహిస్తున్నారని, దీన్ని చూస్తుంటే నిధులు దుర్వినియోగం అయినట్లు అనుమానం కలుగుతోందని ఆరోపించారు.
పాఠశాల నిర్మాణపనులు నత్తనడకన సాగుతుండటంతో సమీపంలోని బీబీఎంపీ పాఠశాలలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎలాంటి కనీస సదుపాయాలు లేని కారణంతో ఉపాధ్యాయుల సంఖ్య నాలుగురికి పడిపోయిందన్నారు. పాఠశాల నిర్మాణం పనులు 70 శాతం పూర్తి అయ్యాయని, మిగిలిన పనులు త్వరలో పూర్తి చేయాలని ప్రభుత్వంపై స్థానిక ఎమ్మెల్యే రవిసుబ్రమణ్య ఒత్తిడి తీసుకురావాలని, లేని పక్షంలో తీవ్ర ప్రతిఘటన చేస్తామని హెచ్చరించారు.