పన్నెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తిని ఢిల్లీ అడిషనల్ సెషన్ కోర్టు విడిచిపెట్టింది.
న్యూఢిల్లీ: పన్నెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తిని ఢిల్లీ అడిషనల్ సెషన్ కోర్టు విడిచిపెట్టింది. నిందితుడు కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అతనికి ఒక అవకాశం ఇస్తూ శిక్ష విధించలేదు.‘ పిల్లలే దేశానికి తరగని సంపద , వారి ఎదుగుదల అభివృద్ధిలపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉంది. చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన సమయం వచ్చింది. ఎన్నో అంతర్జాతీయ తీర్మానాలు, కోర్టు తీర్పులు ఈ విషయాన్ని నొక్కిచెప్పాయి’ అని జడ్జి వినోద్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయానికి ప్రాసిక్యూషన్ సరైన వాదనలు విన్పించడంలో విఫలం కావడం ఒక కారణం. విచారణ సందర్భంగా చిన్నారి నిందితుడ్ని కోర్టులో గుర్తించింది. కాకపోతే ఆమె తల్లిదండ్రులు ప్రాసిక్యూషన్ వాదనలు కొంత గందరగోళంగా ఉన్నాయని జడ్జి వ్యాఖ్యానించారు. ఢిల్లీకి చెందిన సునీల్‌పై అత్యాచారం చట్టం సెక్షన్-354, లైంగిక వేధింపులు, ఐపీసీ సెక్షన్8 కింద కేసులు నమోదయ్యాయి.
నిందితుడు కుటుంబం అతని సంపాదనపైనే ఆధారపడి ఉంది, అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉదారభావంతో ఈ నిర్ణనయం తీసుకుంటున్నట్లు జడ్జి చెప్పారు. ఇలాంటి తప్పుకు పాల్పడటం తొలిసారి కావటం కూడా అతని విడుదలకు ఓ కారణమైంది. వ్యక్తిగత పూచీకత్తు రూ,10,000, ఒకరి హామీగా ఉండాలని ఈ సందర్భంగా కోర్టు షరతు విధించింది. ప్రొబిషనర్ ఆఫీసరు నిందుతుడి కుటుంబ ఆర్థికస్థితిపై ఇచ్చిన నివేదిక ఆధారంగా కోర్టు పరిగణలోకి తీసుకుంది. రాబోయే సంవత్సర కాలంలో నిందితుడి ప్రవర్తన గమనించాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఆ చిన్నారికి వాయువ్య జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ(డీఎల్‌ఎస్‌ఎ)ని బాలికకు నష్టపరిహారంగా రూ,50,000 అందించాల్సిందిగా ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళ్తే జూన్3, 2013 రాత్రి తన ఇద్దరు చెల్లెళ్లతో మంచంపై నిద్రపోతున్న చిన్నారిపై సునీల్ లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో చిన్నారి గట్టిగా అరవడంతో మేల్కొన్న తల్లిదండ్రులు చుట్టు పక్కల వారు అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.