ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఏమైంది?
బుధవారం బళ్లారి సిటీ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపై తీవ్ర గాయాలతో పడి ఉన్న ఈ యువతి ఒక ఐటీ ఉద్యోగిని. ఇది ప్రమాదమా.., లేక ఆత్మహత్యాయత్నమా? అనేది తేలాల్సి ఉంది. ఇంటి నుంచి బయల్దేరిన యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో ఇలా కనిపించింది. ఘటనపై పోలీసులు నోరుమెదపడం లేదు.
బళ్లారి అర్బన్ : సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే యువతి రైలు పట్టాలపై తీవ్ర గాయాలతో పడి ఉండగా రైల్వే పోలీసులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఈఘటన బళ్లారి నగరంలోని రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలోని మోతీ బ్రిడ్జీ పక్కన బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. బళ్లారిలోని పార్వతీనగర్‌కు చెందిన స్వాతి (22) బీకాం పూర్తి చేసి పూణాలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది.
ఈమెకు తండ్రి మృతి చెందాడు. తల్లి బళ్లారిలో పెద్ద కుమార్తెతో కలిసి నివాసం ఉంటోంది. స్వాతి ఉగాది పండుగ కోసం బళ్లారి వచ్చింది. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఇంటినుంచి వెళ్లిన స్వాతి రైలు పట్టాలపై గాయాలతో కనిపించింది. ఘటనపై బళ్లారి రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. యువతి ఆత్మహత్యకు యత్నించిందా? ప్రమాదవశాత్తు రైలు కింద పడి గాయపడిందా ? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.