జేడీఎల్పీ నేతగా కొనసాగుతా | JDLC leader continues | Sakshi
Sakshi News home page

జేడీఎల్పీ నేతగా కొనసాగుతా

Published Fri, Aug 30 2013 4:18 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM

JDLC leader continues

సాక్షి, బెంగళూరు : తన రాజీనామా నిర్ణయంపై జేడీఎల్పీ నేత కుమారస్వామి వెనక్కు తగ్గారు. విపక్ష నేతగా కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు తేల్చి చెప్పారు. లోకసభ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి నైతకి బాధ్యత వహిస్తూ జెడీఎల్సీ నేత స్థానానికి, పార్టీ అధ్యక్ష స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే జేడీఎస్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు బెంగళూరులోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఓ సమావేశాన్ని గురువారం నిర్వహించారు.

సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఇటీవల జేడీఎస్ పార్టీపై విమర్శలు ఎక్కువయ్యాయని అన్నారు. కుటుంబ పార్టీగా జేడీఎస్‌పై ముద్ర వేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. వీటికి సమాధానం చెప్పాలనే ఉద్దేశ్యంతోనే తాను రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించానని అన్నారు. అయితే సమావేశంలో మెజారిటీ సభ్యుల కోరిక మేరకు జెడీఎల్పీ నేతగా కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, విపక్ష విప్ స్థానానికి ఇతరులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

మంగళవారం లోపు ఈ ఎంపిక ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. పార్టీలోని నేతల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను చర్చల ద్వారా పరిస్కరించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, సమావేశానికి మాగడి నియోజక వర్గ ఎమ్మెల్యే హెచ్.సి బాలకృష్ణతోపాటు బసవకళ్యాణ శాసనసభ సభ్యుడు మల్లికార్జున ఖుబా డుమ్మాకొట్టారు. వీరిలో సీబీఐ దర్యాప్తునకు భయపడి బాలకృష్ణ కాంగ్రెస్‌వైపు చూస్తున్నారనే వదంతులు వ్యాపిస్తున్నాయి. మల్లికార్జున ఖుబా బుధవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడకు రాజీనామా పత్రాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు తమ రాజీనామాను స్పీకర్ ద్వారా ఆమోదింపజేసుకుంటే శాసనసభలో జేడీఎస్ బలం 40 నుంచి 39 పడిపోవడమే కాకుండా ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షహోదాను కోల్పోనుంది.
 
జేడీఎస్‌ను వీడను : జమీర్‌అహ్మద్

 తాను జేడీఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను చామరాజపేట ఎమ్మెల్యే జమీర్‌అహ్మద్‌ఖాన్ కొట్టిపారేశారు. హజ్ యాత్రలో ఉండటం వల్లే లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో పూర్తిస్థాయిలో పాల్గొనలేదన్నారు. ఇందుకు మీడియా విపరీతార్థాలు తీసిందని అసహనం వ్యక్తం చేశారు. కుమారస్వామితో తన స్నేహం విడదీయనిదని తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం జేడీఎస్‌పార్టీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement