విజయ్ 60వ చిత్రానికి దర్శకుడు కేవీ?
తమిళసినిమా: ఇళయదళపతి విజయ్ 60వ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు కె.వి.ఆనంద్ దర్వకత్వం వహించనున్నట్లు కోలీవుడ్ సమాచారం. రజనీకాంత్ నటించిన శివాజీలాంటి చిత్రాలకు ఛాయాగ్రహణం అందించి బ్రహ్మాండం అనిపించుకున్న కే.వీ.ఆనంద్ కనా కండేన్ చిత్రంతో మెగాఫోన్ పట్టిన ఈ ఛాయాగ్రాహకుడు ఆ తరువాత సూర్యతో అయన్, జీవా హీరోగా కో వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. అయితే ఆ మధ్య సూర్యతో రూపొందించిన మాట్రాన్ ఆశించిన విజయం సాధించలేదు.
పస్తుతం ధనుష్ హీరోగా తెరకెక్కించిన అనేగన్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. తదుపరి విజయ్ హీరోగా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. విజయ్ ప్రస్తుతం శింబుదేవన్ దర్శకత్వంలో సోషల్ మైథాలజికల్ చిత్రం చేస్తున్నారు. ఇది ఈయనకు 58వ చిత్రం. కాగా 59వ చిత్రానికి యువ దర్శకుడు అట్లి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం 2015లో సెట్‌పైకి వెళ్లనుంది. దీంతో ఇళయదళపతి 60వ చిత్రానికి కేవీ ఆనంద్ దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇది సూపర్ యాక్షన్, రొమాన్స్ అంశాలతో కూడిన భారీ చిత్రంగా ఉంటుందంటున్నారు.