అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్‌తో ఉలిక్కిపడ్డ కర్ణాటక
బెంగళూరు: ఐటీ, బీటీ సిటీ, ఉద్యాననగరిగా పిలవబడే బెంగళూరు నగరం ప్రస్తుతం ఉగ్రవాదులకు నెలవుగా మారుతోందా అంటే అవున నే సమాధానమే వినిపిస్తోంది. గత ఏడాది డిసెంబర్ 28న జరిగిన బాంబు పేలుడు ప్రజల మనసుల్లో నుంచి తొలగిపోక ముందే భారీ ఎత్తున పేలుడు పదార్థాలతో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేయడం చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. గత కొంతకాలంగా కర్ణాటకతో పాటు బెంగళూరులో సైతం ఉగ్ర కదలికలు కనిపిస్తూనే ఉన్నాయి. గత ఏడాది నవ ంబర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘సిమి’తో సంబంధాలున్నట్లుగా భావిస్తున్న ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను గుల్బర్గాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థకు తన ట్వీట్‌ల ద్వారా మద్దతిస్తున్న ఆరోపణలపై ‘మెహ్దీ’ అనే వ్యక్తిని సైతం బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత గత ఏడాది డిసెంబర్ 28న నగరంలోని చర్చ్‌స్ట్రీట్‌లో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు తాజాగా బెంగళూరులోని పులకేశినగర్‌తో పాటు భట్కళ్ ప్రాంతంలో సోదాలు జరిపిన పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు గురువారం సాయంత్రం ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి భారీ ప్రమాణంలో పేలుడు పదార్థాలను, బాంబులు తయారు చేయడానికి వినియోగించే సర్క్యూట్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో కర్ణాటకతో పాటు బెంగళూరు నగరం ఉగ్రవాదులకు అనువైన ప్రాంతంగా మారుతోందా అన్న అనుమానాలు అందరిలోనూ తలెత్తుతున్నాయి.
కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో సైతం కదలికలు....
హుబ్లీ-ధార్వాడ, గుల్బర్గా, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ తదితర ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇండియన్ ముజాహిద్దీన్, లష్కర్-ఇ-తొయ్బా, సిమి, అల్-ఉమా తదితర ఉగ్రవా ద సంస్థలు తమ జాడలను రాష్ట్రంలో విస్తరింపజేస్తున్నాయనేది ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ఈ సమాచారంతో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు.
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్ర జాడలు....
ఇక గురువారం సాయంత్రం రాష్ట్ర పోలీసులు ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేయడంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. శుక్రవారమిక్కడి విధానసౌధ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉగ్రవాదుల కార్యకలాపాలు కేవలం బెంగళూరు, భట్కళ్ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాలేదన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర పోలీసులు దాడులు జరిపి ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఉద్యాననగరి...ఉగ్రవాదులకు నెలవు
Published Sat, Jan 10 2015 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM
Advertisement