
లోకాయుక్త పంజా
- రాష్ట్ర వ్యాప్తంగా 23 చోట్ల ఏకకాలంలో సోదాలు
- రూ.7 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం
- ఆదాయం కన్నా 201 రెట్లు ఆస్తులున్న ఐఎఫ్‌ఎస్ అధికారి
సాక్షి, బెంగళూరు : ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్న ఏడుగురు ప్రభుత్వ అధికారులకు చెందిన కార్యాలయాలు, ఇళ్లపై రాష్ట్ర లోకాయుక్త శుక్రవారం ఏకకాలంలో దాడులు చేసింది. బెల్గాం, చిక్కమగళూరు, దార్వాడ, గుల్బర్గా, తుమకూరు, యాదగిరి జిల్లాలో 23 చోట్ల సోదాలు చేపట్టింది. దాదాపు రూ.7 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకున్నట్లు లోకాయుక్త అదనపు డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్.ఎన్ సత్యనారాయణరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ స్థిర, చరాస్తుల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు నాలుగురెట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. వివరాలు...
బెల్గాంలో ప్రజాపనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఇర్షద్ అహ్మద్ షంశుద్దీన్ కిత్తూర్ రూ.1.12 కోట్ల స్థిర, రూ. 63 లక్షల చరాస్తులను కలిగి ఉన్నారు. వీటి విలువ అతని ఆదాయం కంటే 247.78 శాతం అధికం.
కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్, శివమొగ్గాలో డిప్యుటేషన్‌పై అ సిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఈ హలెశెప్పా ఆదాయం కంటే 127 శాతం ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు.
హుబ్లీలో హుబ్లీ-దార్వాడ డెవెలప్‌మెం ట్ అథారిటీలో మేనేజర్ పరమేశ్వర ప్ప హుచ్చప్పగౌడ విభూతి రూ.51, 73,000 విలువైన స్థిరాస్తులు, రూ.33, 49,610 విలువ జేసే చరాసు లు ఉన్నాయి. ఆదాయం కంటే 166 శా తం ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు.
గుల్బర్గాలోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శరణప్ప బోవినకెరి ఆదాయం కంటే 171 రెట్ల ఆస్తులు కూడబెట్టారు.
గుల్బర్గా, కర్ణాటక గృహమండలిలో ఆఫీస్ సూపరింటెండెంట్ శివపుట్టప్ప రూ.2.12 కోట్ల విలువైన స్థిర,చరాస్తులు కూడబెట్టారు. వీటి విలువ అతనికి వచ్చే ఆదాయంతో పోలిస్తే 146 రెట్లు ఎక్కువ.
కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్ బెంగళూరులో మేనేజింగ్ డెరైక్టర్, ఐఎఫ్‌ఎస్ ర్యాంకు అధికారి ఏసీ కేశవమూర్తి రూ.1.39 కోట్ల స్థిరాస్తులు, రూ.2.86 కోట్ల విలువజేసే చరాస్తులను కూడబెట్టారు. వీటి విలువ అతని ఆదాయం కన్నా 201.53 రెట్లు అధికం.
గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖలో జూనియర్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సుభాష్ చంద్ర తనకు వచ్చే ఆదాయంతో పోలిస్తే 278 రెట్ల ఆస్తులు కలిగి ఉన్నారు.