‘మసాజ్’పై కొరడా
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా మసాజ్ సెంటర్లు వెలుస్తున్నాయి. కొన్ని సెంటర్లు కేవలం మసాజ్ వరకే పరిమితమైనా, మరికొన్ని సెంటర్లు అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా మారాయి. విదేశాల నుంచి, ఉత్తరాది రాష్ట్రాల నుంచి యువతుల్ని రంగంలోకి దించి మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహించే సంస్థలు కూడా ఉన్నారుు. ఇటీవల పోలీసుల దాడుల్లో ఈ వ్యభిచార గుట్టు రట్టవుతోంది. అదే సమయంలో న్యాయబద్ధంగా వ్యవహరించే మసాజ్ సెంటర్లలోనూ దాడులు జరుగుతుండడం ఆయా యాజమాన్యాల్ని కలవరంలో పడేస్తున్నాయి. తమ సెంటర్లపై తరచూ పోలీసులు దాడులు చేస్తుండడాన్ని తీవ్రంగా పరిగణించి ఆ సంస్థలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించాయి.
పిటిషన్ : చెన్నైలోని మసాజ్ సెంటర్ల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారుు. తరచూ తమసెంటర్లపై పోలీసులు దాడులు చేస్తుండడం తీవ్ర నష్టా న్ని కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల దాడుల కట్టడికి చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి సుబ్రమణియన్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. వాదనల అనంతరం న్యాయమూర్తి కొన్ని అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. థాయ్‌లాండ్, మలేషియా వంటి దేశాల్లో మసాజ్ సెంటర్ల నిర్వహణకు కొన్ని రకాల నిబంధనలు, ఆంక్షలు ఉన్నాయని వివరించారు.
ఈ సెంటర్ల కోసం ప్రత్యేక చట్టాలు చేశారని పేర్కొన్నారు. అలాంటి చట్టాలు భారత్‌లో ఎందుకు లేవని ప్రశ్న లేవదీశారు. మసాజ్ సెంటర్ల క్రమబద్ధీకరణ లక్ష్యంగా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఆదిశగా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. మసాజ్ సెంటర్లపై కొరడా ఝుళిపించడం, క్రమబద్ధీకరణ దిశగా ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ చట్టం తీసుకురావడంతో సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదికను సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈనెల 31కు వాయిదా వేస్తూ, ఆ రోజున నివేదికను సమర్పించాలని ఆదేశించారు.