సాక్షి, ముంబై: ఆదర్శ్ కుంభకోణంపై విచారణ కోసం నియమించిన ద్విసభ్య సంఘం సమర్పించిన నివేదికలోని కొన్ని అంశాలను మాత్రమే ఆమోదిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గురువారం నాటి రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నివేదిక పేర్లు ఉన్న బడా రాజకీయ నాయకులపై చర్యలను చేపట్టేందుకు ప్రభుత్వం తిరస్కరించింది. ‘నివేదికలో కొంతమంది రాజకీయ నాయకులు పేర్లు ఉన్నప్పటికీ వారు నేరాలకు పాల్పడ్డట్టు కమిటీ నిర్ధారించలేదు. ఈ కుంభకోణంలో సీబీఐ ఇది వరకే అధికారులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. మేం వారిపై కొత్తగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అనుమతుల జారీలో నిబంధనలను ఉల్లంఘించిన కొందరు అధికారులపై మాత్రం చర్యలు తీసుకుంటాం.
నివేదికలోని మిగతా అంశాలపైనా మరికొన్ని రోజులపై నిర్ణయం ఉంటుంది’ అని ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. ఆదర్శ్ నివేదికపై శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో చర్చ నిర్వహించాలన్న ప్రతిపాదనను తోసిపుచ్చడంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అసంతృప్తి వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. నివేదికను పునఃసమీక్షించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన కేబినేట్ సమావేశాల్లో ఆదర్శ్ అంశం చర్చకు వచ్చింది.
ఆదర్శ్ వ్యవహారంపై విచారణకు రిటైర్డ్ న్యాయమూర్తి పాటిల్ నేతృత్వంలో ద్విసభ్య కమిటీని నియమించడం తెలిసిందే. కమిటీ నివేదికలో 13 అంశాలపై సిఫార్సులు ఇచ్చింది. వీటిలో కొన్ని అంశాలను మాత్రమే స్వీకరిస్తూ మిగతావాటిపై రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని మంత్రి మండలి నిర్ణయింది. ఈ కుంభకోణంలో రాష్ట్రంలోని ఆరుగురు రాజకీయ నాయకుల పేర్లను కమిటీ ప్రస్తావించింది. అయినప్పటికీ వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాల్సిన అవసరం లేదని పేర్కొందని ముఖ్యమంత్రి చవాన్ అన్నారు. కాంగ్రెస్ నాయకులందరికీ ఊరటనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు అంటున్నాయి. ఈ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రులు అశోక్ చవాన్, సుశీల్‌కుమార్ షిండే, దివంగత సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌లతోపాటు శివాజీరావ్ నిలంగేకర్ పాటిల్, రాజేష్ టోపే, సునీల్ తట్కరేకు ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఆదర్శ్ భవనానికి అనుమతులు ఇప్పించే సమయంలో 12 మంది అధికారులు నియమాలను ఉల్లంఘించారని చవాన్ అన్నారు. వారిపై మాత్రం చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వీరందరిపై ఇప్పటికే 2011 జనవరి 29న సీబీఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. అనర్హులుగా గుర్తించిన 25 మంది సభ్వత్వాన్ని ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ నుంచి తొలగిస్తామని చవాన్ ప్రకటించారు. నకిలీ పేర్లతో ఫ్లాట్లు పొందిన వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ప్రత్యేక సమావేశం నిర్వహించడం : తావ్డే
ఆదర్శ్ కుంభకోణంలో పలువురు మాజీ ముఖ్యమంత్రులకు ప్రమేయం ఉన్నట్టు పాటిల్ నివేదిక వెల్లడించినందున, దీనిపై చర్చ కోసం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని సభలో విపక్ష నాయకుడు వినోద్ తావ్డే డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ మేరకు తాను గవర్నర్‌కు లేఖ రాశానని ఈ బీజేపీ నాయకుడు విలేకరులకు తెలిపారు. దీనిపై ఏ నిర్ణయమైనా అసెంబ్లీలోనే తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హర్షం వ్యక్తం చేసిన ఎన్సీపీ
ఆదర్శ్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఎన్సీపీ ప్రకటిచింది. నివేదికలోని కొన్ని అంశాలను మాత్రమే ఆమోదించినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, మొత్తం 13 అంశాలనూ స్వీకరించిందని పేర్కొంది. మరోవైపు ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటనేది కార్యాచరణ నివేదికలో స్పష్టం చేసినట్టు తెలిపింది.