కన్నీటి వీడ్కోలు | Major Mukund Varadarajan cremated with full state honours | Sakshi
Sakshi News home page

కన్నీటి వీడ్కోలు

Published Tue, Apr 29 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 6:39 AM

Major Mukund Varadarajan cremated with full state honours

తీవ్రవాదుల కాల్పుల్లో అమరుడైన మిలటరీ మేజర్ ముకుంద్ వరదరాజన్‌కు సోమవారం చెన్నైలో కన్నీటి వీడ్కోలు పలికారు. అశేష జన సందోహం నడుమ అంతిమ యాత్ర సాగింది. రాజకీయ పక్షాల నేతలు తరలివచ్చి, అమరవీరుడి భౌతిక కాయానికి ఘన నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి రూ.పది లక్షల చెక్కును రాష్ర్ట ప్రభుత్వం తరపున మంత్రి చిన్నయ్య అందజేశారు.
 
 సాక్షి, చెన్నై:జమ్ము కాశ్మీర్ రాష్ట్రం సోఫియా జిల్లాలో తీవ్రవాదులను పట్టుకునే క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మేజర్ ముకుంద్ వరదరాజన్ అమరుడైన విషయం తెలిసిందే. మేజర్ ముకుంద్ వరదరాజన్ చెన్నైవాసి కావడంతో ఆయన భౌతికకాయూన్ని ఇక్కడికి తరలించారు. ఆదివారం అర్ధరాత్రి మీనంబాక్కం విమానాశ్రయంలో మేజర్ భౌతిక కాయూన్ని స్వాధీనం చేసుకున్న ఆర్మీ అధికారులు ఉదయాన్నే ఈస్ట్ తాంబరం ప్రొఫెసర్స్ కాలనీలోని ఆయన నివాసానికి తరలించారు. తండ్రి వరదరాజన్, తల్లి గీత, సతీమణి ఇందుతో పాటుగా ఆప్తులు, సన్నిహితులు, స్థానికులు శోకతప్త హృదయంతో ముకుంద్ భౌతిక కాయం వద్ద కన్నీటి నివాళులర్పించారు.
 
 ముకుంద్ ధరించిన ఆర్మీ దుస్తులను ఆయన సతీమణి ఇందుకు అప్పగించారు. ఈ సమయంలో ముక్కు పచ్చలారని హర్షిత(3) తన తండ్రి భౌతిక కాయం ఉన్న బాక్సు వద్ద పుష్పగుచ్ఛం ఉంచడం అక్కడున్న వాళ్లను కంట తడి పెట్టించింది. అశ్రు నివాళి: ముకుంద్‌కు నివాళులర్పిస్తూ వెస్ట్, ఈస్ట్ తాంబరం, మేడవాక్కం, వేళచ్చేరి పరిసరాల్లో పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటయ్యాయి. ఆ పరిసరాల్లోని యువకులు ముకుంద్‌కు తమ నివాళిని తెలియజేస్తూ, దేశం కోసం అమరుడైన వారికి కన్నీటి నివాళులర్పిద్దాం అని ప్రజలకు పిలుపునిచ్చే విధంగా ఆపోస్టర్లు ఏర్పాటు అయ్యాయి. దీంతో ప్రొఫెసర్స్ కాలనీకి పెద్ద ఎత్తున జన ం తరలి వచ్చారు. రాష్ట్ర మంత్రి చిన్నయ్య, కాంచీపురం జిల్లా కలెక్టర్ భాస్కరన్ ప్రభుత్వం తరపున నివాళులర్పించారు. సీఎం జయలలిత ప్రకటించిన రూ.పది లక్షల చెక్కును ముకుంద్ తండ్రి వరదరాజన్‌కు అందజేశారు.
 
 పల్లావరం ఎమ్మెల్యే ధన్‌సింగ్, తాంబరం మునిసిపల్ చైర్మన్ కరిగాలన్, శ్రీ పెరంబదూరు అన్నాడీఎంకే ఎంపీ అభ్యర్థి రామచంద్రన్, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్, కాంగ్రెస్ చెన్నై జిల్లా పార్టీ నేత కరాటే త్యాగరాజన్, డీఎంకే తరపున మాజీ మంత్రి తాము అన్భరసు, మాజీ ఎమ్మెల్యే రాజా, బీజేపీ తరపున ఆ పార్టీ జాతీయ మహిళా నేత తమిళిసై సౌందరరాజన్‌తోపాటుగా పెద్ద ఎత్తున వివిధ పార్టీలు, ప్రజా సంఘాలకు చెందిన ప్రతినిధులు ముకుంద్‌కు ఘన నివాళులర్పించారు. రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య ఓ ప్రకటనలతో తన సంతాపం తెలియజేశారు. ముకుంద్ కుటుంబానికి తన సానుభూతి తెలియజేశారు.

 అంత్యక్రియలు: ప్రొఫెసర్ కాలనీ నుంచి ఆర్మీ లాంఛనాలతో ముకుంద్ పార్థివ దేహానికి అంతిమ యాత్ర ఆరంభం అయింది. ఆర్మీ అధికారి సంజీవ్ చోప్రా తదితరులతో పాటుగా ఆర్మీ సిబ్బంది, పెద్ద ఎత్తున జన సందోహం అంతిమయాత్రలో పాల్గొన్నారు. బెసెంట్ నగర్ శ్మశాన వాటికలో ఆర్మీ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 42 తూటాలు గాల్లో పేలగా, ముకుంద్ భౌతిక కాయాన్ని ఎలక్ట్రానిక్ శ్మశాన వాటికలో దహనం చేశారు. ఈ సందర్భంగా అమరుడికి అక్కడున్న జనం, ఆర్మీ సిబ్బంది, అధికారులు నివాళి అర్పించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement