బెంగళూరు : రెప్పపాటులో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవడమంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఈ వార్త చదివిన తర్వాత వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ఎంత అవసరం అనేది మీకే అర్థమవుతుంది. వివరాలు.. బెంగుళూరుకు చెందిన సురజిత్ బెనర్జీ వృత్తి రిత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఫిబ్రవరి 7న ఆఫీసు పని ముగించుకొని బైక్‌పై ఇంటికి వస్తున్న తరుణంలో డిఎల్‌ఎఫ్ దగ్గరలో ఉన్న అక్షయ్‌నగర్ వద్దకు రాగానే ఒక దారం అతని తలకు అడ్డుగా వచ్చింది. రెప్పపాటు క్షణంలోనే బైక్‌పై ఉన్న సురజిత్ బెనర్జీ హెల్మట్ గ్లాస్ ఓపెన్ చేసి ఉండడంతో కంటి, ముక్క భాగాన్ని కోసుకుంటూ వెళ్లింది. దీంతో అప్రమత్తం అయిన బెనర్జీ సడన్‌బ్రేక్ వేసి కిందకు దిగి పరిశీలించగా ఒక పతంగికి కట్టిన మాంజా దారం కనిపించింది. కాగా ఆ సమయంలో సురజిత్ హెల్మట్ పెట్టుకోవడంతో పెద్ద ముప్పు తప్పింది. దీంతో బతుకుజీవుడా అనుకుంటూ ఆసుపత్రికి వెళ్లిన బెనర్జీ చికిత్స చేయించుకొని ఇంటికి వెళ్లాడు.
ఇదే విషయమై అతని భార్య స్వాగత బెనర్జీ మాట్లాడుతూ..' మేము స్లమ్ ఏరియాకు దగ్గరలో ఉండడంతో మా ప్రాంతమంతా చీకటిగా ఉంటుంది. నా భర్త ఆరోజు ఆఫీసు నుంచి ఇంటికి వస్తుండగా రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పతంగికి కట్టిన మాంజా రోడ్డుకు ఇరువైపులా కట్టిఉంది. నా భర్తకు చీకట్లో అదేమి కనిపించకపోవడంతో అలాగే ముందుకు వచ్చేశాడు. దీంతో కంటి, ముక్కు భాగానికి మాంజా దారం కోసుకుంది. అదృష్టవశాత్తు నా భర్త హెల్మట్ ధరించడంతో గొంతు భాగానికి మాంజా తట్టకుండా అడ్డుగా నిలిచింది. ఇది నిజంగా మా అదృష్టమే.. లేకుంటే నా భర్త మెడ తెగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచేవాడు. దేవుడి దయ వల్ల అలాంటిదేమి జరగలేదు' అంటూ బెనర్జి భార్య భావోద్వేగానికి గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment