అదే పార్టీ, వారే అభ్యర్థులు
పునరి్వభజన నుంచీ ఇదే ట్రెండ్
కాస్మోపాలిటన్ సిటీలో కులాధిపత్యం
నాలెడ్జ్ కేపిటల్. ఐటీ హబ్. దిగ్గజ శాస్త్ర సాంకేతిక సంస్థల నిలయం. కాస్మోపాలిటన్ సంస్కృతి. చెప్పుకుంటూ పోతే బెంగళూరు నగర ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ లెక్కలన్నింటినీ పక్కన పెట్టేస్తున్నారు నగర ఓటర్లు. అన్నిచోట్లా ఉన్నట్టే కులం, మతం, పార్టీ విధేయతలకే ఓటేస్తున్నారు!
బెంగళూరు నగర పరిధిలో 4 లోక్‌సభ సీట్లకూ శుక్రవారం రెండో విడతలో పోలింగ్ జరగనుంది. 2008లో లోక్‌సభ నియోజకవర్గాల పునరి్వభజన జరిగినప్పటి నుంచీ ఆ స్థానాల్లో ఓటర్లు ఎప్పుడూ ఒకే పారీ్టకో, అభ్యరి్ధకో పట్టం కడుతుండటం విశేషం...
బెంగళూరు పరిధిలోని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన అభ్యర్థే గెలవడం, ఒకే పార్టీకి ఓటర్లు జై కొట్టడానికి నియోజకవర్గాల పునరి్వభజన జరిగిన తీరే కారణమనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. నేతలు తమకు అనుకూలమైన కులాలు, మతాల ఓటర్లు ఒకే నియోజకవర్గంలోకి వచ్చేలా జాగ్రత్త పడటం వల్లే ఈ ట్రెండ్ కొనసాగుతోందనే వాదనలు బలంగా ఉన్నాయి. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ధోరణి ప్రతిఫలిస్తోంది.
2008 నుంచి బెంగళూరులోని మొత్తం 28 అసెంబ్లీ స్థానాల్లో 57 శాతం సీట్లను సిట్టింగ్ ఎమ్మెల్యేలే గెలుస్తూ వస్తున్నారు. మరో 18 శాతం సీట్లను ఒకే ఎమ్మెల్యే లేదా పార్టీ కనీసం రెండుసార్లు గెలవడం విశేషం. ఆ లెక్కన చూస్తే నగరంలోని 75 శాతం స్థానాలు ఒకే అభ్యరి్థకో, ఒకే పారీ్టకో ‘రిజర్వ్’ అయిపోయాయన్నమాట! రాజకీయాల్లో తరచూ వినిపించే ఓటర్ల వ్యతిరేకత, సిట్టింగ్ ప్రజాప్రతినిధిపై అసంతృప్తి వంటివి బెంగళూరుకు వర్తించవు!
నగర పరిధిలోని తొమ్మిది అసెంబ్లీ సీట్లలో బీజేపీ నుంచి, ఏడు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్థులే మళ్లీ గెలిచారు. శివాజీనగర్‌లో 2008 నుంచి వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ టికెట్‌పై ఎమ్మెల్యే అయిన రోషన్ బేగ్ 2019లో బీజేపీలోకి దూకారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్ చేతిలో ఆయన చిత్తుగా ఓడటం విశేషం! అర్షద్‌కు ఎమ్మెల్యేగా అది రెండో విజయం. చామరాజ్‌పేట్ నుంచి మూడుసార్లు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ మాత్రం రెండుసార్లు జేడీ(ఎస్) టికెట్‌పైనా గెలిచారు.
వొక్కళిగలే కీలకం...
బెంగళూరులో ఇలా ఒకే పార్టీ, ఒకే అభ్యర్థి వరుసగా గెలుస్తున్న ట్రెండ్ వెనక పలు ఇతర కారణాలూ ఉన్నా కులమే కీలక ఫ్యాక్టర్‌గా నిలుస్తోంది. పార్టీ ఓటు బ్యాంకుతో పాటు పారీ్టలు, నేతల మధ్య లోపాయకారీ అవగాహన, తటస్థ ఓటర్ల మొగ్గు కూడా ప్రభావం చూపుతున్నాయి.
► బెంగళూరులోని 28 అసెంబ్లీ స్థానాల్లో 4 ఎస్సీ రిజర్వుడు సీట్లు. వాటిని బీజేపీ, కాంగ్రెస్ చెరో రెండు చొప్పున తమ ఖాతాలో వేసుకుంటూ వస్తున్నాయి.
► బెంగళూరు పరిధిలోని 28 మంది ఎమ్మెల్యేల్లో 13 మంది వొక్కళిగ కులానికి చెందినవారే. మిగతా సీట్లలో కూడా వారి ప్రభావం గట్టిగా కనబడుతుండటం నగరంలో కులాలవారీ ఓటింగ్ కీలకంగా నిలుస్తోందనేందుకు తిరుగులేని నిదర్శనం.
► పునరి్వభజన తర్వాత పరిసర గ్రామీణ ప్రాంతాల నుంచి బెంగళూరు నగర పరిధిలోని నియోజకవర్గాలకు ఓటర్ల వలస కూడా ఈ ధోరణికి మరింత దోహదపడుతోంది.
► వొక్కళిగ, ఎస్సీ రిజర్వుడ్‌తో పాటు ముగ్గురు ముస్లిం, ఒక క్రిస్టియన్ అభ్యర్థులు శివాజీనగర్ శాంతిగనర్, చామరాజ్‌పేట్, సర్వజ్ఞనగర్‌లో అసెంబ్లీ స్థానాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు.
► రాజాజీనగర్, గాం«దీగనర్, బసవనగుడి, చిక్పేట్ నియోజవర్గాల్లో ఎప్పుడూ బ్రాహ్మణ సామాజిక వర్గమే గెలుస్తోంది.
► ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో నగరంలో టికెట్ల కేటాయింపులోనూ వొక్కళిగల ఆధిపత్యం కొట్టొచి్చనట్టు కనిపిస్తోంది. నాలుగు సీట్లలో మూడింటిని కాంగ్రెస్ ఆ సామాజికవర్గానికే కట్టబెట్టింది. బెంగళూరు నార్త్ నుంచి రాజీవ్ గౌడ, సౌత్ నుంచి సౌమ్యా రెడ్డి, రూరల్‌లో డీకే సురేశ్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి బెంగళూరు నార్త్ అభ్యర్థి శోభ కరంద్లాజె, రూరల్ నుంచి సీఎన్ మంజునాథ కూడా వొక్కళిగలే.
► బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో చాలావరకు మైనారిటీల ఆధిపత్యమే కావడంతో మన్సూర్ అలీకి కాంగ్రెస్ టికెటిచి్చంది.
లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే ధోరణి
► నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత మూడు లోక్‌సభ ఎన్నికల్లోనూ బెంగళూరు పరిధిలోని స్థానాల్లో దాదాపు ఒకే పార్టీ, లేదా అభ్యర్థే గెలిచారు.
► బెంగళూరు రూరల్ 2013 ఉపఎన్నిక నుంచీ కాంగ్రెస్ కంచుకోటగా మారింది. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ ఇక్కడ హ్యాట్రిక్ కొట్టారు. నాలుగో విజయం కోసం మళ్లీ బరిలో దిగారు. ఆయనదీ వొక్కళిగ కులమే. ఇక్కడ బీజేపీ కూడా అదే
సామాజిక వర్గానికి చెందిన దేవెగౌడ అల్లుడు సి.ఎన్.మంజునాథను బరిలో దింపింది.
► బెంగళూరు సెంట్రల్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ పీసీ మోహన్ కూడా హ్యాట్రిక్ వీరుడే. ఈసారి కూడా ఆయనే బరిలో ఉన్నారు. కాంగ్రెస్ మాత్రం అభ్యరి్థని మార్చి మన్సూర్ అలీతో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
► బెంగళూరు సౌత్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ తేజస్వీ సూర్య మళ్లీ పోటీలో ఉన్నారు. ఇక్కడ 1991 నుంచీ కాషాయ జెండానే ఎగురుతుండటం విశేషం! దాంతో ఈసారి రాష్ట్ర మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దింపింది.
► బెంగళూరు నార్త్‌లో మాత్రం 2014 నుంచీ గెలుస్తున్న సదానంద గౌడను బీజేపీ ఈసారి పక్కనబెట్టింది. ఉడుపి–చిక్‌మగళూరు
ఎంపీ, కేంద్ర మంత్రి శోభ కరంద్లాజెను బరిలో దింపింది. ఆమె కోస్తా వొక్కళిగ కాగా కాంగ్రెస్ అభ్యర్థి రాజీవ్ గౌడ స్థానిక వొక్కలిగ కావడం విశేషం.
బెంగళూరు నగర పరిధిలోని లోక్‌సభ స్థానాలు
బెంగళూరు నార్త్, బెంగళూరు రూరల్, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు సౌత్
నోట్: ‘గతం’ శీర్షికన అందిస్తున్న లోక్‌సభ ఎన్నికల సిరీస్‌కు రెండో విడత పోలింగ్ కవరేజీ కారణంగా ఈ రోజు విరామం. ఆ సిరీస్ రేపటినుంచి యథావిధిగా కొనసాగుతుంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment