
మంగళూరు: పీపీఈ కిట్ ధరించకుండా అంత్యక్రియలకు హాజరై ఓ ఎమ్మెల్యే కోవిడ్ నిబంధనలను అతిక్రమించారు. కోవిడ్ సూచనలు పాటిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలవాల్సిన ప్రజా ప్రతినిదే నిబంధనలను తుంగలో తొక్కుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మంగళూరులో కరోనా బారిన పడ్డ డెబ్భై యేళ్ల వృద్ధుడు మంగళవారం మరణించాడు. బొలరా మసీదులో బుధవారం అతని అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబసభ్యులందరూ దాదాపు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ (పీపీఈ కిట్లు) ధరించే హాజరయ్యారు. కానీ మాజీ మంత్రి, మంగళూరు ఎమ్మెల్యే యూటీ ఖదేర్ మాత్రం పీపీఈ కిట్ ధరించకుండానే దహన సంస్కారాల్లో పాల్గొన్నారు. (కోవిడ్‌తో డీఎంకే ఎమ్మెల్యే మృతి )
దీనిపై సంబంధిత అధికారులు అతడిని ప్రశ్నించగా "మనిషికి శాశ్వత వీడ్కోలు తెలపడం ప్రాథమిక బాధ్యత. చనిపోయిన వారికి గౌరవ మర్యాదలతో దహన సంస్కారాలు చేయాల"ని ఎమ్మెల్యే సెలవిచ్చారు. కాగా కర్ణాటకలో ఇప్పటివరకు 9,721 మంది కరోనా బారిన పడగా 150 మంది మరణించారు. ఇక మంగళవారం ఒక్కరోజే దేశంలో గణనీయంగా 15,968 కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. బుధవారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 4,56,183కు చేరింది. (పోలింగ్‌లో పాల్గొన్న కరోనా సోకిన ఎమ్మెల్యే)