నాగపూర్‌లోని శాసనసభకు పోలీసు శాఖ భారీ భద్రత కల్పించింది. దీంతోపాటు ఈ నగరంలోని మిగతా ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున బలగాలను మోహరించింది.
సాక్షి, ముంబై: నాగపూర్‌లోని శాసనసభకు పోలీసు శాఖ భారీ భద్రత కల్పించింది. దీంతోపాటు ఈ నగరంలోని మిగతా ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున బలగాలను మోహరించింది. ఇందుకు కారణం శీతాకాల సమావేశాలు జరిగే సమయంలో మావోయిస్టులు, ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశముందంటూ సమాచారం అందడమే. ఈ నెల తొమ్మిదో తేదీన నాగపూర్‌లో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే సమావేశాల సమయంలో దాడి జరిగే అవకాశముందంటూ సమాచారమందడంతో నాగపూర్ నగరపోలీసు విభాగం ఏకంగా తొమ్మిది వేలమంది సిబ్బందిని మోహరించింది. వీరిలో కొందరు యూనిఫాంలతో, మరికొందరు సాధారణ దుస్తులతో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరమంతటా పోలీసులే కనిపిస్తున్నారు.
శాసనసభ భవన పరిసరాల్లో, అటు దారితీసే మార్గాలలో సీసీటీవీ కెమెరాలు, వాచ్ టవర్లను ఏర్పాటు చేశారు. కాగా గత కొద్దినెలలుగా గడ్చిరోలి, గోండియాలతోపాటు ఉప రాజధాని అయిన నాగపూర్‌లో కూడా మావోయిస్టుల కార్యకలాపాలు అధికమయ్యాయి. అంతేకాకుండా పోలీసులు, మావోల మధ్య తరుచూ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగపూర్‌లో ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 20 వరకు జరగనున్న సమావేశాల సమయంలో మావోలు తెగబడే ప్రమాదం పొంచిఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. శాసనసభ భవన పరిసరాలతోపాటు నగరమంతటా సిబ్బందిని మోహరించినట్టు పేర్కొన్నాయి. కాగా సరిహద్దు రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల నుంచి నగరంలోకి ప్రవేశించే రహదారులన్నీ పోలీసుల అధీనంలోనే ఉన్నాయి. మరోవైపు సమావేశాల సమయంలో తమ డిమాండ్ల సాధన కోసం వివిధ సంఘాలు ర్యాలీలు నిర్వహిస్తుంటాయి. దీనిని ఆసరాగా చేసుకుని మావోలు ర్యాలీల గుంపు లో చేరే ప్రమాదం కూడా లేకపోలేదు.