
ఎంసీఏ ఎన్నికల్లో నేతల మధ్య పోటీ
- మరోసారి పోటీ చేసే యోచనలో ఎన్సీపీ చీఫ్ పవార్
- బీజేపీ నుంచి ఉపాధ్యక్ష పదవికి పోటీచేయనున్న ఆశీశ్
- 1991లో ప్రారంభమైన రాజకీయ నేతల పోటీ
- ప్రముఖ నేతలందరికీ చెరో క్లబ్బు
సాక్షి, ముంబై: ‘ముంబై క్రికెట్ అసోసియేషన్’ (ఎంసీఏ) ఎన్నికల్లో ప్రధాన పోటీ ప్రముఖ రాజకీయ నాయకుల మధ్య మరోసారి జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నెల 17న జరగనున్న ఎన్నికల బరిలో ఎవరి ఉండనున్నారనేది ప్రస్తుతం అధికారికంగా స్పష్టం కాకపోయినా ఊహాగానాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. గతంలోనూ ఎన్నికలు రాజకీయ నీడలో జరిగిన విషయం తెలిసిందే.ప్రస్తుత ఎంసీఏ అధ్యక్షుడిగా ఎన్సీపీ అధినేత మాజీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ఉన్నారు. 2013లో జరిగిన ఎన్నికల్లోనే ఆయన దూరంగా ఉంటారని భావించినప్పటికీ .. మళ్లీ బరిలోకి దిగి విజయం సాధించారు.
ఈ సారి కూడా పోటీ చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ముంబై బీజేపీ అధ్యక్షుడు ఆశీశ్ శెలార్ కూడా ఉపాధ్యక్ష పదవికి పోటీ చే యనున్నట్టు సమాచారం. దీంతో రాజకీయం గా కనపడని పొత్తు ఎంసీఏ ఎన్నికల్లో కన్పించే అవకాశాలున్నాయి. ఎన్సీపీ, బీజేపీ ఒక్కటిగా పోటీ చేసి చెరో స్థానాన్ని కైవసం చేసుకోవాలని యోచిస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వ భాగ స్వామి, బీజేపీ మిత్రపక్షం శివసేన మాత్రం ఈ విషయంలో పూర్తి వ్యతిరేకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. విజయ్ పాటిల్‌కి చెందిన ‘క్రికెట్ ఫస్ట్ గ్రూప్’కు ఆ పార్టీ మద్దతు పలుకుతున్నట్టు తెలిసింది. అలాగే ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రతాప్ సర్‌నాయిక్, ఎంపీ రాహుల్ శెవాలే క్రికెట్ ఫస్ట్ గ్రూప్ నుంచి ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలు కనబడుతున్నాయి. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. వారం రోజుల వరకు ముంబై రారు. ఈ నేపథ్యంలో ఆయన వస్తేనే ఈ అంశంపై తుది నిర్ణయం వెలువడుతుంది.
91 నుంచి రాజకీయ నేతల అరంగేట్రం
ఇప్పటి వరకు చాలా మంది రాజకీయ నాయకులు ఎంసీఏ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు చేపట్టారు. మొట్టమొదటిసారిగా 1991లో క్రికెట్ అభిమాని అయిన శేషారావ్ వాంఖడే అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన పేరునే ముంబై స్టేడియానికి పెట్టారు. తర్వాత 1992లో మాధవ్ మంత్రి, శివసేన నేత మనోహర్ జోషీల మధ్య అధ్యక్ష పదవి కోసం పోటీ జరిగింది. అందులో మనోహర్ జోషీ విజయం సాధించారు. వరుసగా ఎనిమిదేళ్ల పాటు అధ్యక్షునిగా కొనసాగారు. 2000 నుంచి 2012 వరకు శరద్ పవార్ కంట్రోల్‌లోకి ఎంసీఏ వచ్చింది. అదే సమయంలో బీసీసీఐ, ఐసీసీ అధ్యక్ష పదవులను కూడా పవార్ అలంకరించారు. 2012లో మాత్రం ముంబై ఓటర్ల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో చివరి క్షణంలో తప్పుకున్నారు. అధ్యక్ష పదవిలో లేకపోయినా వెనుకనుంచి కింగ్‌మేకర్ పాత్రను పోషిస్తూ వచ్చారు. ఆ సమయంలో అధ్యక్ష పదవికి పోటీ చేసిన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌కు మద్దతు తెలిపారు.
ముంబైలో 330 క్రికెట్ క్లబ్‌లు..
ముంబైలో ఒకటి రెండు కాదు ఏకంగా 330 క్రికెట్ క్లబ్బులున్నాయి. వీటిలో అనేక క్లబ్‌లకు రాజకీయ నాయకులే అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. కొన్నింటిని రూ. కోట్లు వెచ్చించి కొందరు రాజకీయ నాయకులు కొనుగోలు చే శారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, యువ సేన అధ్యక్షుడు ఆదిత్య ఠాక్రే, బీజేపీ నాయకు లు ఆశీష్ శెలార్, ఎన్సీపీ నేతలు సచిన్ ఆహిర్, జితేంద్ర అవాడ్, శివసేన నాయకులు రాహుల్ శెవాలే ఎంసీఏ రాజకీయాల్లోకి ప్రవేశించారు.
ప్రముఖ నేతలకు చెందిన క్లబ్బుల వివరాలు
శివసేన:
ఉద్ధవ్ ఠాక్రే: మేరీ క్రికెటర్స్.
ఆదిత్య ఠాక్రే: యంగ్ ఫ్రెండ్స్.
సుభాష్ దేశాయ్: ప్రభోదన్.
మిలింద్ నార్వేకర్: న్యూ హింద్.
రాహుల్ శెవాలే: దాదర్ క్రికెట్ క్లబ్
బీజేపీ:
అశీష్ శెలార్: రాజస్థాన్ స్పోర్ట్స్ క్లబ్.
కాంగ్రెస్:
పథ్వీరాజ్ చవాన్: మాజ్‌గావ్ క్రికెట్ క్లబ్.
నారాయణ్ రాణే: ఎలెవన్ సెవంటీ క్లబ్.
ఎన్సీపీ:
శరద్ పవార్: పారసీ పయనీర్.
జితేంద్ర అవాడ్: మాండవీ ముస్లిం
ఎమ్మెన్నెస్:
నితిన్‌సర్‌దేశాయ్: దాదర్ పారసీ జోరస్ట్రీయన్