'నోట్ల రద్దుతో ఆదాయం తగ్గింది'
► నోట్ల రద్దుతో ఇబ్బందులు తాత్కాలికమే
► మంత్రి తన్నీరు హరీష్‌రావు
కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ.500, 1000 నోట్ల రద్దుతో రాష్ట్ర ఆదాయం తగ్గిందని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్‌లో ఆదివారం తెలంగాణ వికాస సమితి జిల్లా మహాసభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో అభివృద్ది పనులు స్పీడ్ పెంచుతున్న తరుణంలో పెద్ద నోట్ల రద్దుతో కొంత బ్రేక్ పడిందన్నారు.
నోట్ల రద్దుతో రాష్ట్రానికి వచ్చే కమర్షియల్, రిజిస్ట్రేషన్, ఆర్టీఏ తదితర రంగాల నుంచే వచ్చే ఆదాయం తగ్గిందని హరీష్ చెప్పారు. నోట్ల రద్దుతో వచ్చే ఇబ్బందులు శాశ్వతం కాదని, తాత్కాలికమే అని అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఆర్థికంగా వచ్చే ఇబ్బందులను అధిగమించేందుకు సహకారం అందించాలని ప్రధాని మోదీ దృష్టికి సీఎం కేసీఆర్ తీసుకెళ్లినట్లు తెలిపారు.
నోట్ల రద్దుతో పేద, సామాన్యులు, రైతులకు, వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నోట్ల రద్దు విషయంలో స్పష్టత రాలేదని, మరో నాలుగు రోజుల్లో కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడ్డాక పైరవీలకు తావులేదని, గతంలో కలెక్టర్లు ఎప్పుడు వస్తరో తెలియక పోయేదని, ప్రస్తుతం నెలకు మూడు రోజులు గ్రామాల్లో తిరుగుతున్నారని హరీష్రావు అన్నారు.