
నష్టాల నివారణకు ఆర్టీసీ ప్రయత్నం
సాక్షి, ముంబై: నష్టాల బాటలో నడుస్తున్న మహారాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఎమ్మెస్సార్టీసీ) ఆ పరిస్థితి నుంచి గట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం స్థానిక పోలీసులు, రవాణ శాఖతో కలసి పనిచేయాలని నిర్ణయించింది. ముంబై వంటి మహానగరం నుంచి తాలూకా స్థాయి వరకు ఎక్కడ చూసినా బస్టాండ్ బయట అక్రమంగా ప్రైవేటు వాహనాలను నిలిపి, ప్రయాణికులను తీసుకెళ్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గి ప్రతిరోజు సంస్థకు రూ.కోట్లలో గండి పడుతోంది.
దీన్ని నివారించేందుకు బస్‌స్టాండ్‌కు 200 మీటర్లలోపు ప్రైవేటు వాహనాలను నిలిపి ఉంచకుండా స్థానిక పోలీసుల సాయం తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలంటే కనీసం ఐదు వేల మందికి పైగా పోలీసుల అవసరముంటుంది. అందుకు అయ్యే వ్యయాన్ని భరించే స్థోమత ఆర్టీసీకి లేదు. ఇంత త్వరగా అంత మందిని సమకూర్చడం సాధ్యపడదు. దీంతో తాత్కాలికంగా 500-1000 వరకు పోలీసులను సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ రూ.వేయి కోట్లకు పైగా నష్టాలను చవిచూస్తోంది. దీనికి తోడు ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతూనే ఉంది. ఎన్ని రాయితీలు కల్పించినా సీజన్‌లో మినహా ప్రయాణికుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. ఇలా చేస్తే కనీసం నష్టాల శాతం అయినా తగ్గే అవకాశం ఉంది.