చిన్న రాష్ట్రాల విషయంలో శివసేన రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని ఎన్సీపీ ఆరోపించింది. ప్రత్యేక విదర్భ రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్న బీజేపీతో ఆ పార్టీ పొత్తు ఎందుకంటూ నిలదీసింది.
ముంబై: చిన్న రాష్ట్రాల విషయంలో శివసేన రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని ఎన్సీపీ ఆరోపించింది. ప్రత్యేక విదర్భ రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్న బీజేపీతో ఆ పార్టీ పొత్తు ఎందుకంటూ నిలదీసింది. పార్టీ కార్యాలయంలో గురువారం ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఉద్ధవ్‌ఠాక్రే.. సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు మద్దతు పలికారన్నారు.
ఒకవేళ ఉద్ధవ్ నిజంగానే సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు మద్దతుదారుడైతే సమైక్య మహారాష్ట్రకు భిన్నంగా వ్యవహరిస్తున్న బీజేపీతో పొత్తు ఎందుకని ప్రశ్నించారు. ప్రత్యేక విదర్భకు మద్దతుగా బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడణవిస్ ఆ ప్రాంతంలో ఇటీవల సైకిల్ ర్యాలీని పచ్చజెండా ఊపి ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా నవాబ్ గుర్తుచేశారు.