
నవ వరుడు సహా ముగ్గురు హత్య
సాక్షి, తిరుచ్చి: తమిళనాడు తిరుచ్చి సమీపాన నవ వరుడు సహా ముగ్గురు దారుణహత్యకు గురయ్యారు. తిరుచ్చి తిరువానైకావల్ సమీపాన కల్లనై రోడ్డులో ఆదివారం ఉదయం ముగ్గురు యువకుల మృతదేహాలు కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో మృతులు తిరువానైకావల్ కలంజియ పురానికి చెందిన జేసీబీ ఆపరేటర్లుగా తేలింది.
మృతులలో ఒకరు తిరువానైకావల్ కలంజిపురానికి చెందిన వేలు (26), అదే ప్రాంతానికి చెందిన అనసూయ (19)ను ప్రేమించాడు. ఇద్దరూ వేర్వేరు కులాల వారు కావడంతో వివాహానికి అనసూయ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి స్నేహితుల సాయంతో వివాహం చేసుకుని కోవిలడి ప్రాంతంలో నివసిస్తున్నారు. మిగతా మృతులను శంకర్ (35), పుదుకోటై అనైవాసల్‌కు చెందిన లోకనాథంగా గుర్తించారు. అనసూయను పోలీసులు విచారించగా శనివారం రాత్రి ఫోన్ చేసి వస్తానని చెప్పిన వేలు ఇంటికి రాలేదని తెలిపింది. వీరిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టి హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.