భారతిపై చర్యలు తీసుకోవాలని చెప్పలేదు | NHRC directs action against Somnath Bharti | Sakshi
Sakshi News home page

భారతిపై చర్యలు తీసుకోవాలని చెప్పలేదు

Published Tue, Apr 1 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 AM

NHRC directs action against Somnath Bharti

 న్యూఢిల్లీ: రాష్ట్ర న్యాయశాఖ మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతిపై చర్యలు తీసుకోవాలని తాము ఢిల్లీ పోలీసులకు నిర్దిష్టంగా ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. దక్షిణ ఢిల్లీలోని ఖిడ్కీ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో అర్థరాత్రి జరిగిన ఘటనపై అవసరమైన చర్యలు తీసుకోవాలని మాత్రమే సూచించామని తెలిపింది. ఖిడ్కీ ఘటనకు సంబంధించి సోమ్‌నాథ్ భారతిపై చర్యలు తీసుకోవాలని తాము ఢిల్లీ పోలీసులను ఆదేశించినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయని పేర్కొంది. అయితే తాము అటువంటి ఆదేశాలేవీ ఇవ్వలేదని స్పష్టం చేసింది. నాటి ఘటనపై తాము స్వయంగా విచారణ చేపట్టామని తెలిపింది. సంబంధిత అధికారుల నుంచి నివేదికల కోసం వేచి చూస్తున్నామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సామాజిక కార్యకర్త షెహజాద్ పూనావాలా నుంచి తమకు ఫిర్యాదు అందిందని, దానిని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు పంపామని ఎన్‌హెచ్‌ఆర్‌సీ తెలిపింది. ఆ ఫిర్యాదుపై ఎనిమిది వారాల్లోగా సరైన చర్య తీసుకోవాలని మాత్రమే కోరామని వివరించింది. ఆ ఫిర్యాదుపై ఎటువంటి చర్య తీసుకోవాలో పోలీసులు నిర్ణయిస్తారని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రతినిధి అన్నారు. ఎవరిపై, ఏ చర్య తీసుకోవాలో తాము మాత్రం సూచించలేదని స్పష్టం చేశారు. 
 
 మానవ హక్కుల కమిషన్ ఆదేశాలపై ఆప్ నాయకుడు సోమ్‌నాథ్ భారతి స్పందిస్తూ, ఈ కేసులో ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదైందని పేర్కొన్నారు. తాను చట్టాలను గౌరవిస్తానని, ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఏమి రాసినప్పటికీ, ఎఫ్‌ఐఆర్‌ను అధిగమించి ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు. నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రకారమే దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. ‘‘వారు నా నియోజకవర్గానికి వెళ్లి అక్కడి ప్రజలను ప్రశ్నించవచ్చు’’ అన్నారు. ‘‘ఎన్‌హెచ్‌ఆర్‌సీ తన అధికారులను నా నియోజకవర్గానికి పంపి, ఆ రోజు జరిగింది సరైందో కాదో అక్కడి వారిని అడిగి తెలుసుకోవాలి. చట్టాన్ని ఉల్లంఘించడం జరిగిందో లేదో తెలుసుకోవాలి. కనీసం నిజానిజాలను తెలుసుకొనేందుకు ప్రయత్నించాలి. ఉగాండా మహిళలు సైతం నా వద్దకే భద్రత కోసం వస్తారు’’ అని చెప్పుకున్నారు. విదేశీయులు వ్యభిచారం, మాదక పదార్థాల రాకెట్లను నడుపుతున్నారని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారులో న్యాయశాఖ మంత్రిగా ఉన్న సోమ్‌నాథ్ భారతీ, తమ మద్దతుదారులతో కలిసి జనవరి 15న అర్థరాత్రి సమయంలో ఖిడ్కీ ఎక్స్‌టెన్షన్ చేరుకుని, విదేశీ మహిళల నివాసాలపై సోదాలు జరపాలని, వారిని అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. కానీ మంత్రి ఆదేశాలను పాటించడానికి పోలీసులు నిరాకరించారు. మంత్రి చర్య ఆ తరవాత వివాదానికి దారితీసింది. ఈ ఘటన అనంతరం తమను వేధించారని ఆరోపిస్తూ కొంతమంది ఆఫ్రికన్ మహిళలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 
 
 న్యాయస్థానం ఆదేశాలపై మాలవీయనగర్ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎయిమ్స్‌లో తమపై వైద్య పరీక్షలు నిర్వహించిన తీరు అవమానకరంగా ఉందని ఓ మహిళ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. మూత్రపరీక్ష కోసం శాంపిల్ ఇవ్వవలసిం దిగా మంత్రి, ఆయన వెంటనున్నవారు అందరి ఎదుట కోరారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన దర్యాప్తు సంఘం సోమ్‌నాథ్ భారతిని తప్పుపట్టింది. ఖిడ్కీ ఎక్స్‌టెన్షన్‌లో సోమ్‌నాథ్ భారతి పాత్రను ఢిల్లీ మహిళా కమిషన్ కూడా ప్రశ్నించింది. అయితే మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ మాత్రం సోమ్‌నాథ్ భారతి చర్యను గట్టిగా సమర్థించారు. విదేశీ మహిళలను అరెస్టు చేయాలన్న మంత్రి ఆదేశాలను పాటించేందుకు నిరాకరించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని కోరుతూ ఆయన ధర్నా జరిపి సంచలనం సృష్టించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement