చర్చకు నో చాన్స్ | NO discussion on Adarsh scam | Sakshi
Sakshi News home page

చర్చకు నో చాన్స్

Published Sat, Dec 21 2013 12:06 AM | Last Updated on Fri, Jul 26 2019 5:53 PM

NO discussion on Adarsh scam

 సాక్షి, ముంబై: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసుకు సంబంధించి విచారణ కమిషన్ అందజేసిన 700 పేజీల దర్యాప్తు నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. విశ్రాంత న్యాయమూర్తి జేఏ పాటిల్ నేతృత్వంలోనిఇద్దరు సభ్యుల నేతృత్వంలోని విచారణ బృందం సమర్పించిన నివేదికతోపాటు చర్యల నివేదిక (ఏటీఆర్)ను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సభలో ప్రవేశపెట్టారు. సదరు నివేదికపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌ను స్పీకర్ తోసిపుచ్చారు. దీంతో చాలాసేపు సభలో గందరగోళం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రులతోపాటు ఇతర మంత్రులను రక్షించుకునేందుకే ప్రభుత్వం చర్చలను తోసిపుచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కాగా సదరు నివేదికలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే, మాజీ కేంద్ర మంత్రి దివంగత విలాస్‌రావ్‌దేశ్‌ముఖ్, ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రి రాజేష్ టోపే, నీటివనరుల శాఖ మంత్రి సునీల్ తట్కరేలకు ద్విసభ్య కమిషన్ అక్షింతలు వేసిన విషయం తెలిసిందే.
 వాస్తవాల్ని పాతిపెడుతోంది
ద్విసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను మహారాష్ర్ట మంత్రిమండలి తిరస్కరించడంద్వారా ఆదర్శ్ కుంభకోణంలో వాస్తవాలనుమరుగుపరిచేందుకు యత్నిస్తోందని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్‌జైట్లీ ఆరోపించారు. గతంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఇచ్చిన నివేదికను తనకు అనుకూలంగా మార్చుకోవడంద్వారా 2జీ కుంభకోణాన్ని పాతిపెట్టిందని ఆయన శుక్రవారం ట్విటర్‌లో పేర్కొన్నారు.‘2జీ కుంభకోణాన్ని జేపీసీ పాతిపెట్టింది. ఆదర్శ్ కుంభకోణాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం పూడ్చిపెడుతోంది. అయితే ఏనాటికీ సత్యాన్ని పాతిపెట్టలేరు’ అని ఆయన అందులో పేర్కొన్నారు.
 
 అవినీతి బాగోతం బయటపడింది
ద్విసభ్య కమిషన్ నివేదికను ప్రభుత్వం తోసిపుచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీల అవినీతి బాగోతం బయటపడిందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు. శాసనసభా ప్రాంగణం వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నివేదికను తిరస్కరించడంద్వారా మచ్చలేని నాయకుడిగా రాష్ట్రానికి వచ్చిన ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్... తాను కూడా అవినీతిలో భాగస్వామినేనని నిరూపించారన్నారు. ఆదర్శ్ కుంభకోణం విషయంలో ప్రభుత్వాన్ని ఏవిధంగా ఎదుర్కొంటారని మీడియా ప్రశ్నించగా న్యాయపరంగా అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. తిరస్కృతికి కారణాలేమిటో ప్రజలందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీల బాగోతాన్ని ప్రజల ముందుంచుతామన్నారు. ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement