మరో మాటే లేదు: కాంగ్రెస్
Published Wed, Dec 25 2013 11:16 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు తమ పార్టీ వెలుపలి నుంచి మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ ప్రతినిధి సందీప్ దీక్షిత్ ధ్రువీకరించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో తమ పార్టీ వైఖరిలో ఎటువంటి మార్పూ లేదని స్పష్టం చేశారు. ఆప్‌కు మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీలో వెలువడుతోన్న స్వరాలన్నీ కొందరు నేతల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనన్నారు. ఆప్‌కు మద్దతుపై కొందరు నాయకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే విషయాన్ని జనార్దన్ ద్వివేది కుండబద్దలు కొట్టారన్నారు.
తమ పార్టీపై ఆప్ ఉపయోగిస్తున్న భాషను నేతలు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. అయితే ఇది కొందరు నేతల వ్యక్తిగత అభిప్రాయమేనని, పార్టీ నిర్ణయం ఎటువంటి పరిస్థితుల్లోనూ మారబోదన్నారు. కాగా ఆప్‌కు మద్దతు ఇవ్వకపోతే బాగుండేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది వ్యాఖ్యానించిన సంగతి విదితమే. కాగా ఢిల్లీ విధానసభకు చెందిన ఎనిమిదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అర్విందర్ సింగ్ లవ్లీ, జైకిషన్, హరూన్ యూసఫ్‌లు ఆప్‌కు మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారంటూ వార్త్తలొచ్చాయి. మరోవైపు మద్దతు విషయమై కాంగ్రెస్ పార్టీ పునరాలోచనలో ఉందంటూ వచ్చిన వార్తలపై కేజ్రీవాల్ ప్రతిస్పందిస్తూ అది ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారమన్నారు. తమ పార్టీ కాంగ్రెస్‌తోగానీ, బీజేపీతోగానీ పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు.
Advertisement
Advertisement